మేడారం జాతర

రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజు మొదలై నాలుగు రోజుల పాటు తెలంగాణాలోని మేడారంలో అద్భుతమైన జాతర జరుగుతుంది.దానినే మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అని పిలుస్తారు.ఉత్తర భారతదేశంలో కుంభమేళా వలే ఇక్కడ కూడా దాదాపు కోటి మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.     

ఆదివాసీయుల ఆత్మాభిమానానికి ప్రతీకగా క్రీ.శ.13 వ శతాబ్ది నుండి ఈ జాతర ఉన్నది.కాకతీయ ప్రభువు శ్రీ ప్రతాపరుద్రుడు ఈ జాతరను ప్రారంభించాడు.

 కోయ పురాణాల ప్రకారం పూర్వం బయ్యక్కపేట అనే కోయగూడాన్ని మేడరాజు పాలిస్తూ ఉండేవాడు.అతనికి సంతానము లేదు. మేడరాజు,భార్య అమ్మవారికి,నాగేంద్రుడికి పూజలు చేసి అమ్మా! నువ్వు ఒక్కసారి మా ఇంట్లో జన్మించు అని వేడుకొనేవారు. ఒకసారి  వాళ్ళు అడవిలోకి వెళితే పుట్ట మీద  ఒక పాప కనిపించింది. ఆ పాప నవ్వుతూ కేరింతలు కొడుతోంది. విచిత్రంగా ఆ పాప చుట్టూ సింహాలు,పులులు కాపలా కాస్తున్నాయి. కొంతమంది ఆ పాప పుట్ట మీద కాదు ఆ పుట్ట పక్కన తవ్వుతుంటే ఒక మందసం అంటే పెట్టెలో దొరికింది అని చెపుతారు రామాయణంలో సీతమ్మ వారిలాగ. ఏమైనా ఆ పాప అయోనిజ. వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇంటికి తెచ్చుకొని ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు.  చల్లదనం అనే అర్ధంతో తెలంగాణాలో సమ్మగా అని వాడుక. అలాగే సర్వజనుల సమ్మతి అని కూడా ఉన్నది. సమ్మక్క పెరిగి పెద్దదవుతూ ఉండేటప్పుడు ఎంతో దివ్యత్వాన్ని ప్రదర్శించేది. ఆ గ్రామస్థులనందరినీ కన్నబిడ్డలుగా చూసుకొనేది. వాళ్ళు కూడా సమ్మక్కని అమ్మవారి స్వరూపంగా భావించేవారు. ఎలాంటి రోగాలైనా తల్లి చేత్తో మందు ఇస్తే నయమయిపోయేవి. ఎంతటి కష్టంలో ఉన్నా ఆ తల్లి ఒక్కసారి తాకితే స్వస్థత పొందేవారు. కొన్నాళ్ళయినాక ఆ తల్లి “నేను ఈ గూడెంలో ఉండను దూరంగా ఉన్న దేవరగుట్ట అనే కొండ మీద ఉంటాను” అన్నది. తల్లిదండ్రులు ఒంటరిగా ఎలా ఉంటుందో అని చింతించారు. అనేక విధాల నచ్చజెప్పారు. కానీ సమ్మక్క నాకు ఏ భయం లేదు మీరు నిశ్చింతగా ఉండండి ప్రకృతిలో నేను స్వేచ్ఛగా ఉండగలను. నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు అని తల్లిడండ్రుల భయాన్ని పోగొట్టింది. చిన్నతనంలో ఆ పాప దొరికినప్పుడు సింహాలు, పులులు కాపలా కాయడం చూసిన తల్లిదండ్రులు ఆమెలో ఏదో దివ్యత్వము ఉన్నది అని గ్రహించి అమ్మాయిని ఆ కొండ మీద దింపి ఆ తల్లి అవసరాల కోసమని జలకం బావి అని ఒక బావి తవ్వారు. కొంతకాలానికి సమ్మక్కని  మేనల్లుడైన పగిడిద్దరాజుకిచ్చి మాఘ పౌర్ణమి రోజున వివాహం చేశారు.     వీరికి సారలమ్మ,జంపన్న అనే సంతానం కలిగింది. సారలమ్మనే సారక్క అనే పేరుతో పిలుస్తారు. జంపన్న,సారక్కలకు వీరోచిత విద్యలను ఆ దంపతులు నేర్పించారు. సారక్కను తమ బంధువైన గోవిందరాజుకు ఇచ్చి వివాహం చేశారు.

చారిత్రక నేపధ్యము ననుసరించి ఆ కాలంలో ఓరుగల్లు ప్రాంతాన్ని ప్రతాపరుద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడికి సామంతరాజు. ప్రతి సంవత్సరం కప్పం చెల్లిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు వచ్చి తినడానికి తిండి లేకుండా పోయింది. దానితో పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడికి కప్పం చెల్లించలేకపోయాడు. ప్రతాపరుద్రునితో యుద్ధం వచ్చింది.ఆ యుద్ధంలో  కాకతీయ సైన్యం మొదటగా గూడెంలో అడుగు పెట్టే ప్రాంతం  కన్నెపల్లి నుంచి సారక్క,గోవిందరాజులు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు.అక్కడ నుంచి సంపంగి వాగు దగ్గర జంపన్న శత్రువులతో తలపడి ఆ వాగులో పడి మరణించాడు.అతని రక్తంతో తడిసిన ఆ వాగు నీరు ఎర్రగా మారిపోయింది.అప్పటి నుంచీ ఆ వాగు నీరు ఎర్రని రంగులోకి మారిందని ఆ ప్రాంతవాసులు నమ్ముతారు.ఆ తరవాత పగిడిద్దరాజు కూడా వీరమరణం పొందాడు.ఆఖరికి సమ్మక్క యుద్ధరంగంలోకి వచ్చి శత్రువులని చీల్చిచెండాడింది.ఆవిడని దొంగ దెబ్బ తీసి వెనక నుంచి వచ్చి పొడిచారు.ఆవిడ చిలకలగుట్ట మీదకు వెళ్ళిపోయింది.ఆవిడను ప్రజలు వెతుక్కుంటూ వెళితే ఆవిడ కనబడలేదు.కానీ ఆ గుట్ట మీద నెమలినార చెట్టు కింద ఒక పెద్ద కుంకుమ భరిణ,దానిలో కుంకుమ కనిపించినాయి.అందరి పసుపు కుంకుమలు నిలబెట్టడం కోసమని ఆ తల్లి దేహత్యాగం చేసిందని వారందరు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆవిడ త్యాగం ఊరుకినే పోదు కదా.ఆ రోజు రాత్రి ప్రతాపరుద్రుడికి వాళ్ల కులదైవం “కాకతి” కలలో కనిపించి అమాయకులని నిర్దాక్షిణ్యంగా హింసించకు అని హెచ్చరించింది.వెంటనే ప్రతాపరుద్రుడు యుద్ధాన్ని విరమించి వాళ్ళకి క్షమాపణ తెలిపి మేడారం ను ఒక స్వతంత్ర రాజ్యం కింద ప్రకటించాడు. ఈ విషయమంతా జెండాల మీద ఆదివాసీయుల భాషలో నిక్షిప్తమైనది అని చెపుతారు.

తాత్వికంగా చూస్తే వీరందరూ వనదేవతలు.ఆదివాసీయులని రక్షించడానికి వీరందరూ ఒక కుటుంబము కింద వచ్చి కరువు నుండి,యుద్ధము నుండి రక్షించారు.అంత పెద్ద సమస్యను అమ్మవారు మానవ దేహంతో ఆపలేకపోయింది.ప్రాణత్యాగం చేసి ప్రకృతిలో కలిసి పోయి మహాశక్తి కింద అయిపోయి రాజుకి కలలో కనిపించి యుద్ధము విరమించేటట్లు చేశారు.

తన దివ్యమైన శక్తితో అమ్మవారు ఇప్పటికీ కొన్ని కోట్ల మంది కోరికలను తీరుస్తున్నారు.        

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర ఇది. నాలుగురోజుల ఈ జాతరలో తొలిరోజు మాఘ పౌర్ణమి రోజున “మందిరకోలు” అని సారక్కను చేట/మొంటె రూపంలో కన్నెపల్లి నుండి తెచ్చి వెదురుతో కట్టిన గద్దెపై పెడతారు. కొండాయి అన్న ప్రదేశము నుంచి గోవిందరాజుని తీసుకొని వస్తారు.పునుగొండ్ల అన్న ఊరు నుంచి పగిడిద్దరాజుని తీసుకు వస్తారు.ఈ ముగ్గురునీ మేడారం గద్దె మీద కొలువుంచుతారు.

రెండవ రోజు చిలుకుల గుట్ట నుండి సమ్మక్కను వడ్డెల బృందం పూజలు చేసి మేళ తాళాలతో ధూప దీపాలతో  అడవిలో ఒక రహస్యమైన ప్రదేశంలో నుంచి కుంకుమ భరిణ రూపంలో తీసుకువచ్చి గద్దె మీద కొలువుంచుతారు.

మూడవరోజు కొలుపుల రూపంలో పుట్టతేనె,ఇప్పపువ్వు,కొండతేనె,కొండపూలు, ఈతకల్లు,ఈతపళ్ళు సమర్పిస్తారు. అమ్మవారు తమ ఇంటి ఆడపడుచు అని చీర,సారె,వడిబియ్యం సమర్పిస్తారు. కొంత మంది నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు.ఇక్కడ బంగారము అంటే బెల్లం.

నాలగవరోజు వనప్రవేశమనే పేరుతో తిరిగి కన్నెపల్లి, చిలుకుల గుట్ట , కొండాయి, పునుగొండ్ల ఆలయాలకు సారక్క,సమ్మక్క,ఇద్దరు రాజులను సాగనంపడంతో జాతర పూర్తి అవుతుంది.రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తారు.  

మేడారం నుంచి 15 కి.మీ దూరంలో బయ్యక్కపేట ఉంటుంది.వీటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ తల్లి నివసించిన కుటీరం ఉన్నది.దాంట్లో ఒక పుట్ట,పుట్టుగద్దెలు ఉన్నాయి. ప్రస్తుతం దేవరగుట్టని సమ్మక్క గుట్ట అని పిలుస్తున్నారు.అడవిలో జలకం బావి కూడా ఉన్నది. ఎంతో గొప్ప శక్తి అక్కడ ఉండబట్టి అన్ని కోట్ల మందిని ఆకర్షిస్తోంది.