Fake News, Telugu
 

రాజస్థాన్‌లో ఒక వ్యక్తి పైన జరిగిన దాడిలో తెగిన చేతుల ఫొటోలని సంబంధం లేని కల్పిత కథతో షేర్ చేస్తున్నారు

0

తాను ఎంత ప్రార్థన చేసినా కూడా తనకి కావాల్సిన శక్తులు రావట్లేదు అని కోపంతో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక వ్యక్తి తన రెండు చేతులు నరుక్కొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు అని చెప్తూ తెగి ఉన్న చేతుల యొక్క ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ కు చెందిన మహేశ్వర్ సింగ్ అనే వ్యక్తి తాను ఎంత ప్రార్థన చేసినా కూడా తనకు శక్తులు రావట్లేదని కోపంతో తన రెండు చేతులు నరుక్కున్నాడు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో పేర్కొన్న ఘటన గురించి ఎక్కడా ఎటువంటి కథనాలు లేవు. పోస్టులో తెగి ఉన్న చేతుల ఫొటోలు రాజస్థాన్ కు చెందిన సురేశ్ సేన్ అనే వ్యక్తివి. 2019లో జరిగిన ఒక దాడిలో తన చేతులు తెగిపోగా, వైద్యులు పది గంటల సేపు ఆపరేషన్ చేసి వాటిని అతికించారు. కావున, ఈ పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ఈ ఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా ఎక్కడా ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. ఇక పోస్టులో ఉన్న ఫొటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, “The Sun” మరియు “Daily Mail” వెబ్‌సైటులలో ఇవే ఫొటోలతో వార్తా కథనాలను ప్రచురించాయి.

ఈ కథనాల ప్రకారం, 2019 లో రాజస్థాన్‌కు చెందిన  సురేశ్ సేన్ అనే వ్యక్తి పైన ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేయడం వలన రెండు చేతులు తెగిపొయ్యాయి. జోధ్‌పూర్ లోని ఒక హాస్పిటల్‌లో 10 గంటల సేపు ఆపరేషన్ చేసి తన చేతులను మళ్ళీ అతికించారు.

చివరిగా, 2019లో రాజస్థాన్‌లో ఒక వ్యక్తి పైన జరిగిన దాడి వలన తెగిపోయిన చేతుల ఫొటోలను సంబంధం లేని కల్పిత కథతో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll