గురూజీ ల మాటల కు అర్ధాలె వేరులే!

వాక్కు: ఆధ్యాత్మికత అంటే అదేదో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటం కాదు. కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూనే ఆధ్యాత్మికం గా ఎదగ వచ్చు.

లో వాక్కు: అవును మరి. అందరూ హిమాలయాల కు వెళ్తే, మా సంస్థల లో డబ్బు కట్టి మరీ ఎవరు చేరతారు. అయినా సన్యాసుల దగ్గర డబ్బు ఎందుకుంటుంది. అందుకనే సంసారులని ఈ ఆధ్యాత్మికత లోనికి ఆకర్షించాలి.

భాషణ: మా మార్గం శాస్త్రీయమైనది.
అభిభాషణ:ఈ మధ్య జనాలు చదువుకొని తెలివిమీరి సైన్స్ ని నమ్ముతున్నారు. నా మార్గానికి విశ్వసనీయత రావాలంటే, “అది సైంటిఫిక్” అని చెప్పక తప్పదు. అలానే మత గ్రంధాలు చెప్పిన దానికీ సైన్స్ కీ సామ్యం ఉన్న చోట మత గ్రంధాలను కూడా కోట్ చేస్తుంటాం. సామ్యం లేని చోట దాని గురించి మాట్లాడం.

మాట: సైన్స్ చాలా పరిమితమైనది. దానికి తెలిసింది చాలా తక్కువ. సైన్స్ కి అందని విషయాలు చాలా ఉన్నాయి.

లో మాట: ఎవడన్నా మహిమలని ప్రయోగశాల లో నిరూపించమంటే అదో చిక్కు. సైన్స్ కి అందని విషయాలు నాకు మాత్రం అందుతాయా ఏమిటి?సైన్స్ తనకి తెలియని విషయాలని తెలియదు అని ఒప్పుకొంటుంది. మేము కూడా అలా ఒప్పుకొంటే, ఇక మా దగ్గరికి ఎవరు వస్తారు? జనాలను ఆకర్షించటానికి ఏదో ఓ మహిమ చూపించాలి.

పై గుట్టు: వచ్చే రెండేళ్ళ లో ప్రపంచమంతా నా మార్గాన్ని అనుసరిస్తుంది.నా మార్కు ధ్యానం ప్రపంచం అంతటా విస్తరిస్తుంది.

లో గుట్టు: నాకు ఆత్మ పరిశీలన ఎక్కువ.నాకు పేరు సంపాదించటమంటే ఆశ ఎక్కువని నా ఆత్మ పరిశీలన లో తేలింది.పేరు తో పాటే పవర్ కూడా వస్తుంది.

ఓ మాట: మా సంస్థ డబ్బులను ఆశించదు. ఏదో.. సంస్థ ను నడిపించటానికి కొంచెం ఫీజు తీసుకొంటాం, కొన్నిపుస్తకాలు అమ్ముతాం.
రెండో మాట: నాకు డబ్బు కంటే పేరు మీద మోజెక్కువ. అయినా ఆధ్యాత్మికత కీ సంస్థాగత వ్యవస్థ కీ చుక్కెదురని జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటలు ఈ జనాలకు తెలిస్తే ఇక నా గతేం కాను. ఆ కృష్ణ మూర్తికే తన సమావేశాలకి ఫీజు పెట్టటం తప్పలేదు, ఇక నేనెంత?

నుడి: ఆధ్యాత్మిక సాధన లొ వచ్చే పరిణతి ని బట్టి మేము మాస్టర్ అనీ, మెగా మాస్టర్ అనీ ఇలా అనేక రాంకులు ఇస్తూ ఉంటాము. మా మాస్టర్ల దగ్గర దీక్ష పుచ్చుకొనక పోతే, అలాంటి వారికి మోక్షం రాదు. ఎందుకంటే, తర తరాల మా గురువుల శక్తి మా మాస్టర్ల ద్వారా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆ విధం గా అనర్హుల చేతిలోకి ఈ శక్తులు వెళ్ళకుండా కూడ మేము కనిపెడుతూ ఉంటాము.

మున్నుడి:మోక్షాన్ని స్కేలు పెట్టి కొలుస్తామా ఏమిటి? మా సంస్థ లో చేరే వారికి ఒక sense of empowerment కల్పించటానికి ఈ రాంకులు ఇస్తాము. ఏ ఆర్గనైజేషన్ లో అయినా ఈ రాంకులు తప్పని సరే కదా? సమావేశాలలో మాకు ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగే వారిని ఈ మాస్టర్ల సహాయం తో అదుపు లో పెట్టవచ్చు.రాంకులు ఇస్తే జనాలు మనకు సంస్థాగతమైన పని చేసి పెడతారు. మనిషికి తగ్గట్టు గా లౌక్యం గా మెలిగితేనే సంస్థ విస్తరిస్తుంది. మా పధ్ధతులు ఎవరైనా ఎలాగైనా పాటించవచ్చంటే, ఇక మా దగ్గరికి వచ్చేదేవరు.అందుకనే మా ద్వారా నేర్చొకొంటేనే ఫలితం వస్తుందని పేటెంట్ పెట్టేశాం. అమెరికా లో అయితే నిజమైన పేటెంట్ నే తీసుకొన్నాం లెండి.అమెరికా వాళ్ళు కూడా మా పధ్ధతిని అనుసరించటానికి సౌకర్యం గా, బైబిల్ నీ, భగవద్గీత నీ వేదాలనీ ముడి పెడుతూ, మా ధ్యానాన్ని fine tune చేసేశాం. అక్కడి సువార్తీకులు ఇక్కడ జనాలని ఆకర్షిస్తుంటే, మేము అక్కడి భక్తులని ఆకర్షిస్తున్నాం.ఇక ఖురాన్ కి కూడా ఏదో ఓ లింకు కనిపెట్టాలి. ఓ ఇద్దరు డాక్టర్లనీ, ఇంకో సైంటిస్ట్ నీ కూడా మన సంస్థలొకి ఆకర్షించగలిగితే జనాలు ఇకా ఎక్కువ గా నమ్ముతారు.  దీక్ష ఇవ్వటానికి ఆధ్యాత్మిక అర్హత ఉండాలి. అయితే అర్హతలు రాజకీయ నాయకులకీ, ప్రముఖులకీ దీక్ష ఇవ్వటానికి మాత్రం అడ్డు రావు.

నా మాట: అద్వైత స్థితి వలన మనుషులు మారి తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది.
నీతో మాట: నా దగ్గరికి ఎంతో మంది రాజకీయులు వస్తారు. కాసేపు ప్రశాంతం గా ధ్యానం చేసుకొంటారు. బయటికి వెళ్ళి మామూలు గానే అవినీతి చేస్తారు.
అద్వైత స్థితి పొందిన యూజీ నే చెప్పాడు, ఆ స్థితి వలన ఎటువంటి మత పరమైన, ఆధ్యాత్మికమైన, రాజకీయమైన, సామాజికమైన పర్యవసానాలూ ఉండవని. అదో ప్రత్యేకమైన స్థితి అంతే! సమాంతరం గా మనుషులందరి మేలు కోసం,మనుగడ కోసం జరిగే వ్యవస్థా పరమైన, వ్యక్తిపరమైన ఇతర ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. కానీ ఈ మాట చెప్తే, పెద్ద పెద్ద వ్యాపార వేత్తలూ, సినిమా నటులూ నాకు డొనేషన్లు ఎలా ఇస్తారు? వారికి మోక్షం చూపిస్తే నే మనకి లాభం. ఆధ్యాత్మికత, క్లిక్ అయితే బాగా లాభ సాటి వ్యాపారం . ఎందుకంటారా? రజనీకాంత్ లా జీవితం లో అత్యున్నత స్థితికి వెళ్ళిన తరువాత, అటువంటి వారు ఓ ఒంటరి తనాన్ని ఫీలవుతారు.ఇక సాధించటానికి ఏమీ మిగిలి ఉండదు. కానీ వారి సక్సెస్ వలన వారి దగ్గర డబ్బు బాగానే ఉంటుంది. వారికి ఇంకా సత్యమనీ, మోక్షమనీ చూపిస్తే, వారు మళ్ళీ తమ పేరాశ ని కొనసాగిస్తారు ఆ ప్రక్రియ లో మనకీ కొంత ముడుతుంది.

జనం తో మాట: నా దగ్గర అద్వైత స్థితి ని సాధించేందుకు టెక్నిక్కులు ఉన్నాయి.
మనలో మాట: ఓ వంద టెక్నిక్కులు చెప్తాం. పని చేసిందనటానికి ప్రమాణాలేమీ ఉందవు. ఎవరో ఒకరి కి ఏదో ఓ కారణం వలన కొంచెం స్వస్థత వస్తే వారే పని చేస్తుందని చెప్తారు. టెక్నిక్కుల వలన ఆ స్థితి కి వెళ్ళ గలిగి తే అది “సమయానికందని స్థితి”  ఎందుకవుతుందీ? ప్రయత్నం వల్ల సాధ్యం కానిది టెక్నిక్ వలన సాధ్యమౌతుందా? ఏదైనా నేను కొంచెం మెరుగు. కొంతమంది బాబాలు డ్రగ్స్ వాడమని సలహా ఇస్తారు.

చివరి మాట: అద్వైత స్థితి తో పరిపూర్ణ సత్యం అవగతమౌతుంది.
చివరాకరి మాట: అద్వైత స్థితి అనేది మనుషుల, ప్రాణుల అస్థిత్వ పరిధిలోనిదే.కానీ అరుదైన అనుభవం.
పరిపూర్ణ సత్యం అనేది మనుషులెవరికీ అనుభవమవ్వదు. ఎందుకంటే అది మనిషి అస్థిత్వ పరిధి కి బయట ఉంది.ఈ సృష్టీ, విశ్వాల అస్థిత్వ పరిధి కి బయట ఉంటుంది. కాబట్టీ అద్వైత అనుభవం వలన పరిపూర్ణ సత్యం తెలియదు. అంటే, పరిపూర్ణ సత్యం నీకెంత అనుభవమో, నాకూ అంతే అనుభవం. నాకూ తెలియదు..కానీ ఈ విషయాన్ని మా పుస్తకాలలో ఎక్కడో ఓ మూల చెబుతాం. రేపు ఎవరైనా జనాలను మోసం చేశామని చట్టపరమైన చర్య తీసుకొంతే ఇది ఓ డిస్క్లెయిమర్ లా పని చేస్తుంది. ఈ తెలుసుకోలేని పరిపూర్ణ సత్యానికీ, తెలిసిన దైనందిన జీవితానికీ మధ్య అనేక అందమైన, హాయిగొల్పే ఊహ లోకాలనీ,మహిమలనీ, పునర్జన్మలనీ కల్పించి జనాలను ప్రలోభ పెట్టటమే మా ప్రజ్ఞ. మా దగ్గరికి వచ్చే కంటే ఇంట్లో భగవన్నామ స్మరణ చేసుకొంటేనో, ధ్యానం చేసుకొంటేనో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. కానీ ఈ విషయం చెబితే, ఇంకా మా ప్రత్యేకత కి ఏమౌతుంది? “పరిపూర్ణ సత్యం నాకు అందిన”దని చెప్పుకోవటం లో ఇంకో ఉపయోగం ఏమిటంటే, అప్పటి నుంచీ నేనే దేవుడిని అని కూడా నమ్మబలక వచ్చు.

14 thoughts on “గురూజీ ల మాటల కు అర్ధాలె వేరులే!”

  1. ఒక చిన్న ప్రశ్న ఇంత క్రితం “పారలొకిక అనుభవాలూ, మహత్తులూ, పునర్జన్మా ఇవి సైన్స్ పరిధికి బయట ఉన్నాయంటారు. ఆ ముక్క సైన్స్ చెబితే కానీ నాకు వీటి గురించి నమ్మ బుధ్ధి కాదు” అంటు సమాధానం ఇచ్చారు. ఇంతకి సైన్స్ మీద మీకు అంత నమ్మకం ఎందుకు? గురూజీల మీద అంత అపనమ్మకం ఎందుకు?

    మెచ్చుకోండి

  2. గురూజీ ల claims చాలా సార్లు fake అని తేలింది కాబట్టీ, ఈ మహత్తులు కొన్ని వందల కోట్లలో ఏ ఒక్కరికో మాత్రమే ఉండే అవకాశం ఉంది కాబట్టీ, సైన్స్ తనకి తెలియక పోతే “అప్పటికి తన కి తెలియదు” అని ఒప్పుకొంది, కాబట్టీ

    మెచ్చుకోండి

  3. “సైన్స్ తనకి తెలియక పోతే “అప్పటికి తన కి తెలియదు” అని ఒప్పుకొంది”

    సైన్స్ ఎమీ తెలుసు కోవాలనుకొంట్టొంది? ఎందుకు తెలుసుకోవాలనుకొంటోది? ఎవరికొరకు తెలుసుకోవాల్నుకొంటోది? దానికి ఎమైనా నిర్ధుష్ట లక్ష్యం ఉందా? సైన్స్ తనకు తెలియనిదానిని తెలియదు అని చాలా తేలికగా ఒప్పుకొంట్టుందా? కొన్ని వందల కోట్లు తగలేసి, జీవజాలం చంపి ఒప్పుకొంట్టుంది.

    హేతువాదులు, ఆంధ్రజ్యోతి పేపర్ వాడికైతే (సత్యసాయి బాబా సంపద మీద ప్రత్యేక ఆసక్తి) గురువులలో అన్ని అవలక్షణాలే కనిపిస్తాయి. అది వాళ్ల పరిణతిని, వ్యాపార దృకోణ్ణాన్ని సూచిస్తుంది. దానిని అర్థం చేసుకోగలం. వాళ్లైతే అందరి లోపాలను లోకానికి వేల్లడిచేస్తూ, ఈ రోజు విశ్వసనీయతే కోల్పోయారు.

    గురుజీల క్లైంస్ ఫేక్ అని తేలితే మానవాళికి సంభవించే పెనుముప్పు ఎమీటి? కొన్ని వందల కోట్లలో ఒకడిని వెతికి పట్టుకోవటంలో తప్పులు జరగవచ్చు. దానిని నిజమైన అన్వేషకుడు/సీకర్ ఒప్పుకొంటాడు. ఫేక్ గురువులను కలసినందుకు పెద్దగా బాధపడడు. ఫేక్ గురువు వలననే అసలు గురువు మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. గురువును కలవాలి అన్న (ఆ పట్టుదల వెనెకాల బలమైన భావన/అవసరం ఉంట్టుంది ) కోరిక ఉంటే అసలు గురువును తప్పక కలుస్తాడు. మధ్యలో ఫేక్ గురువుల దగ్గర డబ్బులు పోగొట్టుకొన్నానే అని బాధపడరు.

    మెచ్చుకోండి

  4. ఈ విషయాల గురించి ఒక గురూజీ చెప్పిన విషయాలకీ వేరొక గురూజీ చెప్పిన విషయాలకీ పొంతన ఉండదు. ఒకాయన సూక్షం లోకమూ, కారణ లోకమూ అని వర్ణిస్తారు. వేరొక గురువు గారు స్వర్లోకమూ, మహ్ర్లోకమూ అని వివరిస్తారు. అయితే ఈ లోకాల వర్ణన విషయం లో ఒకరు చెప్పిన దానికీ వేరొకరు చెప్పిన దానికీ పొసగదు. అలానే షట్చక్రాలంటారు. వీటి ప్రయోజనం, శరీరం లో వాటి ప్రదేశం మొదలైన విషయాలలో భిన్నమైన వివరణ లు వినవస్తాయి. ఈ చక్రాల ఉనికీ ప్రయోజనం, పని చేసే విధానం మొదలైన వాటిని శాస్త్రీయం గా తేల్చటం పెద్ద కష్టమైన విషయం కాక పోకవచ్చు. కానీ వీటిని లాబ్స్ లో నిరూపించటం కోసం ఎవరూ ముందుకు రారు. (ఒక్క యూజీ గారు దీనికి మినహాయింపు).

    మెచ్చుకోండి

  5. మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను మీడియా ప్రభావం తో ఈ టపా రాయలేదు. ఎక్కడో ఓ చోట యూజీ లాంటి వారు తన శరీరాన్ని పరిశోధనలకు అనుమతించారు.
    “సైన్స్ ఎమీ తెలుసు కోవాలనుకొంట్టొంది? ఎందుకు తెలుసుకోవాలనుకొంటోది? ఎవరికొరకు తెలుసుకోవాల్నుకొంటోది? దానికి ఎమైనా నిర్ధుష్ట లక్ష్యం ఉందా?”
    ఈ విషయం లో సైన్స్ లక్ష్యం తెలుసుకోవటం తో అంతమవుతుంది. నిర్దుష్టమైన లక్ష్యం లేనివన్నీ చెత్త కాదు, ఉన్నవన్నీ గొప్ప కాదు.
    “కొన్ని వందల కోట్లు తగలేసి, జీవజాలం చంపి ఒప్పుకొంట్టుంది. ”
    పరిశోధనలు జరుగుతున్న సవాలక్ష రంగాలలో కొన్ని రంగాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జీవజాలాన్ని చంపకుండా నివారించటన్ని మత, సాంస్కృతిక, ఇతర నాయకులు నిర్ణయించుకోవాలి. సమజం మొత్తం చంపకుండాఉండాలని నిర్ణయం తీసుకొన్నపుడు, సైన్స్ చంపలేదు.

    అణుబాబు లాంటి మహమ్మారులకు సైన్స్ కొంతవరకూ “కారణం” కావచ్చు. కానీ దాని “బాధ్యత” పూర్తి గా సైన్స్ ది కాదు. రాజకీయులదీ, సామాజిక నాయకులదీ, ఇతర మానవాళిదీ కూడా. మీకు “కారణం” కీ బాధ్యత కీ తేడా తెలుసనే అనుకొంటున్నాను. బాధ్యత, కత్తిని ఉపయోగించిన వారి ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. కత్తి తో పొడిచిన వాడి వలన, ఆ కత్తిన తయారు చేసిన వాడికి అంటే బాధ్యత చలా తక్కువ.

    సైన్స్ నీ టెక్నాలజీ నీ విమర్శించటం తేలికే, కానీ ఉపయోగించకుండా ఉండటం కష్టం. మనం రాస్తున్న ఈ బ్లాగ్ మొదలు అనేక వసతులు, వైద్యాలూ సైన్స్ పుణ్యమే! ఓ మనిషికి యాభై యేళ్ళ వయసు వచ్చేసరికి సైన్స్ వలన ఏదో ఒ క్లిష్టమైన పరిష్తితుల నుంచీ బయట పడని వారు అరుదు గా ఉంటారు. మనం ఆత్మ విమర్శ చేసుకొంటే ఈ విషయం తెలుస్తుంది. అలానే ముఖ్యం గా మత సంస్థలా,విద్యా సంస్థ లా రాజకీయ సంస్థల బాధ్యతలకూ వైఫల్యలకూ సైన్స్ నిందించ రాదు. సైన్స్ సామాజిక పరమైన, నైతికమైన సమస్యలను పరిష్కరించగలనని ఎప్పుడూ క్లెయిం చేయలేదు. “నా సినిమా పక్కా మాస్ సినిమా బాబో అనేవాడిని, క్లాస్ సినిమా తీయలేదని తిట్టకూడదు. క్లాస్ సినిమా లు తీస్తానని గొప్పలు పోయేవాడిని తిట్టాలి.

    మెచ్చుకోండి

  6. “దానిని నిజమైన అన్వేషకుడు/సీకర్ ఒప్పుకొంటాడు. ఫేక్ గురువులను కలసినందుకు పెద్దగా బాధపడడు. ఫేక్ గురువు వలననే అసలు గురువు మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. గురువును కలవాలి అన్న (ఆ పట్టుదల వెనెకాల బలమైన భావన/అవసరం ఉంట్టుంది ) కోరిక ఉంటే అసలు గురువును తప్పక కలుస్తాడు. మధ్యలో ఫేక్ గురువుల దగ్గర డబ్బులు పోగొట్టుకొన్నానే అని బాధపడరు.”

    ఈ టపా ఫేక్ గురువుల గురించే, సీకర్ గురించి కాదు. ఫేక్ గురువుల దృష్టి గురించి మాత్రమే! ఫేక్ సీకర్స్(?!) గురించి ఇంకో టపా రాస్తాను…may be

    మెచ్చుకోండి

  7. సీతారాం గారు,

    సీకర్ లేక పోతే గురువు లేడండి. సమాజంలో గురువు అనే వాళ్ల గురించి తెలిసేది శిష్యుల వలనే కదా! వాళ్లంతా జీవితకాలం గురువును అంటికొని ఉండబట్టే ఆయనకి గురించి అందరికి తెలుస్తుంది.

    మెచ్చుకోండి

  8. సైన్స్ ను పూర్తిగా వ్యతిరేకించటానికి/అంగీకరించ కుండా ఉండటానికి నేను ఎడారి మాతాలకు చెందిన వాడిని కాను. నా విషయానికే వస్తే మా బందువులలో అమేరికాలోని యం.ఐ.టి, హార్వర్డ్ లో మీరు చెప్పే సైన్స్ రంగంలో పి.చ్ డి లు చేసిన వారు ఉన్నారు. మన దేశంలో చదువుకొన్న వారికి సైన్స్ ప్రాముఖ్యత ను నొక్కి చెప్పవలసిన అవసరం ఎమీ లేదని నా అభిప్రాయం. హిందువులకు సైన్స్ తో విభేదాలు ఎమీ లేవని మీకు తెలుసు అనుకొంటాను. ఇతర మతాల వారికి సైన్స్ కి మధ్య విభేదాలు ఉండటం వలన, ప్రజలలో సైన్స్ ను వ్యాప్తి చేయటానికి వారు సైన్స్, దాని వలన లాభాల గురించి చాలా ఎక్కువగా ప్రాపగండా చేసుకోవలసి వచ్చింది.

    “వీటిని లాబ్స్ లో నిరూపించటం కోసం ఎవరూ ముందుకు రారు. (ఒక్క యూజీ గారు దీనికి మినహాయింపు).”

    ఎవారికైనా యన్లైట్ మెంట్ ఐతే సైన్స్ తెలిసిన వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే గాని మీరు నమ్మేటట్లు లేరు అని అర్థమౌతున్నాది. అది మీనమ్మకం. అందరికి ఉండవలసిన అవసరం లేదు కదా!

    మెచ్చుకోండి

  9. అమ్మ మాటలను నమ్మటానికి సైంటిఫిక్ ప్రూఫ్ అవసరం లేదు. కానీ గురూజీ ల విషయం వేరు. కొందరు నిజమైన వాళ్ళు, కొందరు ఫేక్. ఎవరు ఫేకో మనకి తెలవటం కష్టం కాబట్టీ, సైన్స్ మీద ఆధారపడతాం. మీకు ఓ గురూజీ తో అమ్మతో ఉన్నటువంటి intuitive relationship ఉంటే అప్పుడు ఆ నమ్మకానికి ఓ ప్రాతిపదిక ఉంటుంది.

    మెచ్చుకోండి

  10. “గురూజీ ల విషయం వేరు. కొందరు నిజమైన వాళ్ళు, కొందరు ఫేక్. ఎవరు ఫేకో మనకి తెలవటం కష్టం కాబట్టీ, సైన్స్ మీద ఆధారపడతాం”

    ఫేక్ గురువుల సంగతి తరువాత అసలికి ఒరిజినల్ గురువు అవసరమేందుకు? పెళ్ళాం, పిల్లలు సంసారాం ఉండే వాళ్లాకి గురువులతో పనేమిటి? సంతోషంగా కుటుంబం తో కాలం గడపకుండా వీడు ఒరిజినలా ఫేకా అని గురువుల మీద ఆర్ అండ్ డి చేసి తెలుసుకొని ఎమీ చేస్తారు? ఒక వేళ గురువు గారు ఒరిజినల ఐతే ఒరిగేది ఎమిటి?

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి