April 30, 2024

చింతామణి -సినిమా గోల

రచన : స్వాతి శ్రీపాద

 

పాపం చింతామణి పేరు నిజానికి అది కాదు. అప్పలమ్మా , వెంకాయమ్మ అసలే కాదు. అలాంటి పేర్లున్నవాళ్ళే నాజూగ్గా శ్రావ్య, శృతి అనీ మార్చుకుంటుంటే సీతామణి పేరు చింతామణి గా మారిపోవడం దురదృష్టమే కదా !

చిన్నప్పుడు వాళ్ళమ్మా నాన్న పెట్టిన పేరు సీతామణే. తెల్లారితే పుడుతుందనగా ఆ సాయంత్రం సీత వాళ్ళమ్మ లవకుశ సినిమా కెళ్ళొచ్చింది. సీతమ్మవారి కష్టాలన్నీ పక్కన పెడితే  కాంతి పుంజంలా మెరిసిపోతున్న బంగారు సీత విగ్రహం చూడగానే వాళ్ళమ్మ మనసులో ఓ మెరుపు తళుక్కుమంది. పుట్టే పిల్లకి  ఆ రంగుండాలి. తస్సదియ్య లోకం మొత్తం దాసోహమనదూ! ఆ రాత్రి ఆవిడకు నిద్ర పడితే ఒట్టు! అటేడు తరాలూ ఇటేడుతరాలూ పచ్చని పసిమి ఛాయ స్వర్ణ సీత గలవారిని స్మరించుకుంటూ, ఛామన ఛాయ, కాస్త రంగు తక్కువగా, నలుపు మరింత గాఢమై కర్రిమొహాల్లా వున్న వాళ్ళందరినీ తిట్టుకుంది, ఈ కాకి మొహాలు మా చుట్టాల్లోనే పుట్టాలా? మరో కొంపలో పుట్టేడవచ్చుగా అని విసుక్కుంది.  కన్ను మూత పడితే ఎక్కడ కొరివిదయ్యాల్లా ఆ నల్లటి చుట్టాలు కల్లోకొస్తారో , ఎక్కడ కల్లోకొస్తే పిల్లకా రంగు వచ్చేస్తుందోనని రాత్రి నిద్రపోలేదు. తెల్లారీ తెల్లారకముందే నొప్పులు మొదలయ్యాయి.

సాయంత్రానికి పుట్టిన పిల్ల బంగారు బొమ్మే.  సీతలా మిలమిల లాడే పిల్ల రంగుచూసి స్వర్ణ సీత అనే పేరు పెడదాం అనుకుంది. ఆమాటే భర్తకు  చెప్పింది. ” రెండు పేర్లెందుకే , సువర్ణ , సీతా….” చదువంతగా అబ్బక వ్యవసాయం చేసుకునే ఆమె భర్తకు నోరు తిరగలేదు,అర్ధమూ కాలేదు. అతను సరే సరి , అత్తగారికి వినిపించాడామాటే ..ఇహ చూడాలి .. కదల్లేనని గొణుక్కునే ఆవిడ ఎగిరి గంతేసి బాలెన్స్ చేసుకోలేక కూలబడి , నొప్పెట్టిన నడుం రుద్దుకుంటూ  ” అవునొరేయ్ .. ఎంతైనా కోడలు తెలివి గలది, నా చిన్నప్పుడు మా చిన్న చెల్లికి అమ్మవారు పోసి ఆర్నెల్లకే కన్నుమూసింది. దాని పేరు సువర్నే పేరు పెట్టు కోవలసిందే… మీ నాన్న పేరు కలిసి వచ్చేలా సీతారావసుబ్బమ్మ అని కూడా కలుపుకుందాం. ” మొగుడి పేరు ఉచ్చరిస్తున్నానని కూడా తోచలేదావిడకు ఆ ఉత్సాహంలో .. అత్తగారు చూడకుండా తలబాదుకుంది సీతామణి తల్లి.

అందుకే చివరకు సీతామణి పేరుతో రాజీ పడిపోయింది. అది కాస్తా స్కూల్లో వేసే సమయంలో బడికి పోనని ఏడ్చిఏడ్చి బలవంతాన వెళ్ళాక ముక్కెగ బీలుస్తూ చెప్పిన పేరు చింతామణిగా వినిపించి అదే రాసి పారేశాడు ఆ మాస్టారు.

అలా చింతామణిగా స్థిరపడి పోయిందామె పేరు.

 

పేరేదైతేనేంగాక, అంగరంగ వైభవంగా పెరిగింది చింతామణి. రోజూ బుట్టేడు మిరపకాయలు దిష్టి పేరిట పొయిలోకి వెళ్ళాల్సిందే.. ఆ ఘాటుకు ఊరు ఊరంతా ఖంగు ఖంగున దగ్గవలిసిందే …

పిల్లపుట్టాక తండ్రికి కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమే అయ్యిందాయె. అంతవరకూ చిన్నకారు రైతుగా వున్న ఆయన రాజకీయాల్లోకి దిగడం కోట్లకు పడగలెత్తడం చింతామణి అదృష్టమేగా మరి.

 

( మనలో మనమాట రాజకీయాలంటేనే దూరం జరుగుతాం. ఉద్యోగాలకోసం వాళ్ళవెంట తిరిగేది, ట్రాన్స్ ఫర్లకు వాళ్ళ మద్దతు కోరడం ఈ బదులు మనమే రాజకీయాల్లోకి వెళ్తేబాగుండు కద….వల్ల కాదంటారా! డోంట్ వర్రీ రాజకీయాలకూ క్రాష్ కోర్స్ అందించే రోజు అట్టే దూరంలో లేదు.)

ముఖ్యంగా రాజకీయ నాయకుల పిల్లలకెలాగూ చదువూ సంధ్యా అబ్బవు . అందుకే వాళ్ళకు చిన్నప్పటినుండే శిక్షణనివ్వడం ఉత్తమం కదా… ఏమో పెద్ద జనాలకూ ఎప్పుడేమవుతుందో… ముందు చూపు చాలా మంచిది కదూ మళ్ళీ అనుభవం లేదనీ టాలెంట్ లేదనీ ఎవరూ అనకుండా…)

అంతేనా ఆపిల్ల తరువాత మరి సంతానం కలక్కపోవడమూ కలసి వచ్చిన అదృష్టమే..

నాలుగో తరగతిలో ఉండగా కాబోలు అల్లరి పిల్లలు చింతామణీ చింతామణి అంటూ పాటలు కట్టి ఏడిపించారు . అంతే !

మరిక స్కూల్ కి వెళ్ళనని మొండి కేసేసింది చింతామణి. చింత పిక్కలాట , బిళ్ళంగోడు ఆటలకు కాలం చెల్లిపోయి టీవీ రోజులొచ్చేసాయిగనక , చాలా రోజులు టీవీ కి కళ్ళు అతికించేసి కూచునేది. తల్లి అటు పోయి ఇటొచ్చి కధ ఏమైందే అంటే  “అబ్బ, కధెవడు చూసాడు ” అనేది. ” కధ కాక మరింకేం చూశావని అడిగితే … అదిగో ఆ కళ్యాణి కట్టుకున్న చీరలు , ఫలానా సీరియల్లో ఆ నాయకీ నగలు .”అంటూ గంటలకొద్దీ వర్ణించేది. అక్కడితో ఆగితే కధే లేదు మరి. టీవీ చూసి చూసి బోర్ కొట్టాక మరో ఆలోచన వచ్చింది చింతామణికి.

నేనే హీరోయిన్ ని ఎందుక్కాకూడదు -అని..

అంతే రోజుకోరకం హీరోయిన్ లా తయారయ్యేది.. ఓ రోజు వాణిశ్రీ .. ఆ రోజంతా అందరూ ఆమెను వాణిశ్రీ అనే పిలవాలి. మరో రోజు శ్రీదేవి… ఇంకోరోజు ఇలియానా … చివరకు అదీ బోర్ కొట్టేసి ఏం చెయ్యాలో తోచనప్పుడు పట్నం నించి పక్కింటి విశాలాక్షి కూతురు పెద్ద హంగూ ఆర్భాటంతో దిగింది.

సినిమాల్లో వేషాలు వేస్తుందటా -అదీ దాని గర్వానిక్కారణం. అబ్బే దానికో రంగూ లేదు హంగూ లేదు. వెలిసిపోయిన నల్లమబ్బు ముక్కలా , చప్పిడి ముక్కు, ఎత్తు పళ్ళూ, ఓ మాదిరి లావు దానికే సినిమాల్లో వేషాలు దొరికితే ఇహా తనలాంటి పుత్తిడి బొమ్మకో …. మనసులో ఎంత మెరమెరగా వున్నా దాన్ని కలిసి సినిమా వేషాలకు దారి కనుక్కోవాలన్నకోరికతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించి దానింటికి బయల్దేరింది.  ఎంతో సవర దీసి మునగ చెట్టెక్కించాక గాని చెప్పడానికది దిగిరాలేదు.  ఒకటేమిటి ఎన్ని రకాలుగా వర్ణించిందో …అబ్బో దీన్నో మహారాణిలా చూసుకుంటారటా….కొండమీద కోతి నడిగినా తెచ్చిస్తారటా…. ఇలా అది చెప్తూ పోతుంటే చింతామణికి వేళా పొద్దూ తెలియలేదు. ఆకలీ దాహమూ తెలియలేదు.

ఆ పైన ఒళ్ళు తెలియలేదు. అంతే ఇంటికి వచ్చి అలిక్కూచుంది. పట్నం వెళ్ళి సినిమాల్లో వేషం వెయ్యాలి.

” అబ్బే దీనికింత రాద్ధాంతం ఎందుకు ? సినిమాలనే మన ఊరికి రప్పిద్దాం … “అన్నాడు తండ్రి.

ఆఘ మేఘాలమీద కబురెళ్ళింది. సినిమా వాళ్ళొచ్చి విడిది చేసారు.. వాళ్ళల్లో హీరో అనిపించిన వాడితో మాట కలిపింది. మరింక ఆలస్యం లేకుండా చింతామణి చుట్టూ చుట్టూ తిరిగి మాటల్తో సినిమా కోట కట్టేసాడు.

అతని పేరు అభిరామ్. ఎర్రగా బుర్రగా హీరో పేరుకి తగ్గట్టుగా ఉన్నాడు. మనిద్దరం హీరో హీరోయిన్లమయితే ఇహ సినిమా కేరాఫ్ మనిల్లే అన్నాడు. రకరకలా ఫోజుల్లో చింతామణి ఫోటోలు తీసి ప్రతి హీరోయిన్ నీముందు దిగదుడుపే అన్నాడు. ఈ పల్లెటూళ్ళో ఏముంది పెళ్ళి చేసుకుని సిటీ వెళ్ళిపోదామన్నాడు. అన్నిటికీ వశీకరణకట్టులో ఉన్నట్టు తలూపింది చింతామణి.

ఇంకేం పెళ్ళు మంటూ పెళ్ళి జరిగిపోయింది. అతని అమ్మా నాన్న అందరూ వచ్చారు వెళ్ళారు. మూడునిద్దర్లు, పదహార్రోజుల పండగ అయిపోయాక , ఓ రోజు గునుస్తూ అడిగింది చింతామణి

” మరి మరి మనం సిటీ కెప్పుడు బయల్దేరుతున్నాం? ”

“ఇంకెక్కడి సిటీ కే పిచ్చిమొహమా… నాలాంటి వాడికే టీలు అందించే పని దొరికితే ఇహ పట్నం వెళ్ళి ఏం చేస్తాం? అయినా మీ అమ్మా నాన్నను వదిలి ఎలా వెళ్తాం… మరో నాల్రోజులు పోయాక మీ నాన్న వెనకాల వెళ్తాలే. నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప … ఓ మా అమ్మా నాన్నానా? వాళ్ళు సినిమా వాళ్ళేలే నాటకమాడారు.. ఇది మీ నాన్నకూ తెలుసు ” అన్నాడు సవిలాసంగా.

 

*************

 

 

 

2 thoughts on “చింతామణి -సినిమా గోల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *