April 30, 2024

కిం కర్తవ్యం !

రచన : నూతక్కి రాఘవేంద్రరావు.

ఆధునిక వైద్య, ఆరోగ్య విధానాల వల్ల గాని, మారిన జీవన స్థితిగతుల వల్లనైతేనేమి, దేశవ్యాప్తంగా వృద్ధుల జీవన కాల దైర్ఘ్యం విశాలమౌతోంది.. అందువల్ల జీవించి వున్న వృద్ధుల సంఖ్యా పెరుగుతోందన్నది నిర్వివాదాంశం. అలా అని వారికి రుగ్మతలు లేవని కాదు వయసుతో వచ్చే కొన్ని సమస్యలు ప్రతీవారిని పీడిస్తూ ఉంటాయి.
ప్రస్తుత సామాజిక స్థితిగతుల్లో, అస్తవ్యస్త రాజకీయ అస్తిరతలో ప్రభుత్వాలు, సేవా సంస్థలు దృష్టి సారించని,శాశ్వత పరిష్కారాన్నికనుగొనని సామాజిక సమస్యలు అనేకం ఉన్నాయి. అందులో ప్రభుత్వాలు, సేవా సంస్థలు, సమకాలీన యువత దృష్టి సారించి అధిక ప్రాదాన్యతనివ్వవలసిన అత్యవసర సమస్య వయోజనుల సమస్య .
ఇప్పటి దనుక ప్రభుత్వాలు వయోజనుల జీవన విధానానికి,భద్రత కలిగించే ప్రక్రియా రచన చేయకపోవడం ప్రభుత్వాల నిష్క్రియాపరత్వానికి మచ్చుతునక.
దేశ పౌరుడిగా జీవితాంతం అనేకానేక రూపాల్లో తినీ తినక తమ శక్తి యుక్తులతో అనేకానేక రంగాల్లో తమ వంతు పాత్ర నిర్వహించి, సంపద సృష్టించి జాతి నిర్మాణంలో ప్రభుత్వాలకు పన్నులు చెల్లించిన వయోజనులు కోకొల్లలు.వృద్ధాప్యంలో వారి సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు…ఒక ప్రక్క. సంతానాన్ని కనీ పెంచి విద్యాబుద్ధులు చెప్పించి రెక్కలిస్తే ఎగిరిపోయి తిరిగి తలిదండ్రులను చూడని సంతానం ఒకప్రక్క.. తలిదండ్రుల ఆస్తులు దక్కించుకొని నిరాధారులైన వారితో ఇంట తమకు. తమ సంతుకు ఊడిగం చేయించుకుంటూ కూడా తలిదండ్రుల ఉనికి భారంగా భావిస్తూ సూటిపోటి మాటలతో నిరాదరణకు గురిచేస్తూ వారి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోని సంతానం మరో వైపు.
ఇలా సమాజంలో వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు దొరకని దీనస్థితిలో ఎందరో వృద్ధులున్నారు. తమ వ్యధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. కడుపు చించుకొంటే కాళ్ళమీద పడ్డట్టు. తమ జీవితాలను ఫణంగా పెట్టి పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులు, ఎండమావులవెంట పరిగెత్తే యువతకు, తమ నిత్య జీవితంలో, అడ్డంకిగా కనబడుతున్నారు వృద్ధాప్య దశలో.
దేశ వ్యాప్తంగా, వుమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై, చిరు కుటుంబ వ్యవస్థ విస్తరించినప్పటినుండి, నిరుద్యోగ పర్వంలో కొనసాగే యువతకు గాని, ఉద్యోగాలలో కొనసాగి భుక్తి గడుపుకొనే యువకులకు గాని, యువ జంటలకు గాని, అనిశ్చితి కలిగిస్తున్న పెద్దసమస్య…. తలిదండ్రుల, అత్తమామల ఆదరణ కొరకు అందుబాటులో లేని సమయం. అంతటా సమయాభావం. చీటికిమాటికి కుటుంబంలో తగవులతో తమ జీవితాలను చికాకు పరుచుకుంటున్న యువజంటలెన్నో.. ఆ కారణంగా వృద్ధుల ఆలనా పాలన నిర్లక్ష్యానికి గురై, నిరాదరింప బడుతున్నారు. అట్టి వృద్ధులు ఎవరికి వారు తమలో తాము కుమిలిపోతూ,సమస్యకి పరిష్కారం కాన రాక జీవితాలను దుర్భరంగా గడుపుతున్నారు.
సంతానం పుట్టినదాది, వారికి రెక్కలిచ్చి ఎగరనిచ్చేవరకు తమ బ్రతుకులు తమవికావు. పిల్లలే వారిప్రపంచం. పిల్లలకు జీవికకై ముక్కున పురుగూ పుట్రా కరిచి తెచ్చి పెంచి, ఎగరడం నేర్పిన పక్షులు తలిదండ్రులు. తమ సంతుకు ఓ ఆధారం కలిగించామన్న ఆనందం, ప్రశాంతత వారికి దక్కడంలేదు. బాధ కలిగినా, ఆనందం కలిగినా..కన్న సంతానంలేక, ఎవరూ ఆదరించే దిక్కులేక ఎందరో వయసు మీదపడిన అవకారాలతో ఒకరికొకరై వృద్ధ దంపతులు కొందరు తమను తామే ఒదార్చుకుంటున్నారు.
మెరమెచ్చుమాటలతో ఉన్నదంతా రాయించుకొని తలిదండ్రులను అనాధలుగా వదిలేసి ఆర్ధికంగా సహకరించని సంతు, తలిదండ్రులు యిచ్చిన చదువులతో ఉన్నత స్థితి కెదిగి, కన్నతలిదండ్రులను తమ తలిదండ్రులుగా చెప్పుకోవడానికి ఇచ్చగించని సంతు, తలిదండ్రులు ఇచ్చిన రెక్కలతో ఎగరడం నేర్చి. విదేశాలకేగి, తమ తమ పిల్లల బ్రతుకులకై సతమతమౌతూ, తలిదండ్రులను గాలికి వదిలి తృణమో ఫణమో ఆర్ధికతోడ్పాటుతో సరిపెట్టే మరోరకం సంతు. సంతానం ఎదుగుదల సమయంలో ఆర్ధిక విషయాల కారణంగా దూరమైన బంధుగణం, వారి మధ్యనే అంత్యదశలో బ్రతుకు పోరాటం.
డబ్బుకు కొదవలేని వారు కొందరు, వయసుమీదబడి శరీరం సహకరించని స్థితిలో పిడికెడు ముద్ద వండుకు తినడం కూడా కష్టమౌతున్న దశ. డబ్బు ఆస్తి ఎంతున్నా ఆదరించి ముప్పూటలు పిడికెడు అన్నం పెట్టే వారికోసం అర్రులు చాచవలసిన దుస్థితి. అవసరమైనప్పుడు వైద్యుని చెంతకు చేర్చే అండ వుండటం, ప్రేమగా పలకరించే మనుషులు అందుబాటులో లభించడం అదో మహా అదృష్టంగా భావిస్తున్న ఎందఱో దురదృష్టవంతులు. వీరి బలహీనతను ఆసరా చేసుకొని చాపక్రింద నీరులా చేరి ఆస్తులు కొల్లగొట్టాలనే దుర్బుద్ధితో పన్నాగాలు పన్నే పన్నగాలు కొన్ని విషపు కోరలు చాస్తున్నాయి.
అట్టి స్థితిలో వృద్ధుల ఆహారం, వైద్యం,వినోదం,ఇతర అవసరాలు, సంరక్షణ చూసే వయోజన వసతి సముదాయాలు ప్రైవేటు రంగంలో అక్కడక్కడా పుట్టుకొస్తున్నాయి. కాని అవి అతి స్వల్ప సంఖ్యలో, అదీ ఆర్ధికంగా సమృద్ధి ఉన్న వున్నత వర్గాలవారికి తప్ప మధ్యతరగతివారికి అందనంత ఎత్తులో వున్నాయి. ఇక సామాన్యులకు అందని ద్రాక్షలె ఆ వృద్ధుల వసతి గృహాలు.. అదీకాక డబ్బు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ తమపై నమ్మకంతో ఆశగా దరిచేరి. ఆధారపడిన వయోజనులపై వారు చూపడంలేదు. అలా మరో కోణంలో దుర్భరమౌతున్న వృద్ధుల బ్రతుకులు..
ఇందుకు పరిష్కార మార్గాలు లేవా ?
సంకల్పం ఉండాలేకాని మార్గాలెన్నో ఉంటాయి.
ఈ క్రింది విధానాలు ప్రణాలికాబద్దంగా ఆచరిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
పరిష్కార మార్గాలు.
1) ఆర్ధికంగా మధ్యతరగతి, సామాన్య వర్గాల వృద్దుల ప్రయోజనార్ధం, సకల సదుపాయాలున్న భవన సముదాయాలు అందుబాటులోకి తేవలసిన బాధ్యత ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలపై వుంది.
2) ఆరోగ్యవంతమైన పరిసరాల్లో ఆహారం, వైద్యం, వినోదం, వున్నత జీవన ప్రమాణాలతో నిశ్చింతగా జీవనం కొనసాగించ గల భద్రతాయుతమైన జీవితం, నిస్వార్ధభరితమైన పర్యవేక్షణ నిర్వహణ, అందించవలసిన బాధ్యత, ప్రభుత్వాలపై ఉంది.
3) సమాజంలోని ఆర్ధికపరంగా మధ్య తరగతి వయోజనులనూ ఓ పీడిత వర్గంగా పరిగణించి వారి జీవన నిర్వహణకై ప్రభుత్వాలు భవన సముదాయాలు నిర్మించి, శాశ్వత నిధిని సమకూర్చి సుశిక్షితులైన నిర్వహణా సిబ్బందిని, అనుబంధంగా వైద్యసిబ్బందిని నియమించి ఉచిత ఔషదాలు అందిస్తూ వయోజనుల సేవలో నియమిస్తే …

1) వయోజనులకు ఊరట లభిస్తుంది.
2) వయోజన సమస్యకో శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
3) తద్వారా దేశవ్యాప్తంగా సేవా దృక్పధం శాశ్వత ప్రాతిపదికన స్థిరీకరించబడి వ్యాప్తి చెందుతుంది.
4) కొన్ని లక్షలమందికి నిరుద్యోగ సమస్య పరిష్కరించబడుతుంది..
5) వయోజనులకు నిశ్చింత, ప్రశాంత జీవనం సమకూరుతుంది.

ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులలో కొంతశాతంతో వృద్ధుల/అనాధల సంక్షేమనిధిని ఏర్పరచి దాని నిర్వహణకై ప్రాంతీయ/రాష్ట్ర/దేశ స్థాయిలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సేవాసంఘాల ప్రతినిధులతో పర్యవేక్ష కమిటీలను నియమించి, సామాజిక సేవాసంస్థలతోనూ, మతసేవాసంస్థలలోనూ నిష్ణాతులైన సమూహాలను గుర్తించి, సకల సదుపాయాలతో వృద్ధులకై సకలహంగులతో స్నాన, శౌచాలయ వసతులతో పరిరక్షిత త్రాగునీరు, బలవర్ధక ఆహారం, ప్రత్యేక వైద్యశాలలతో వైద్యవసతి, ఔషధాల అందుబాటు, అంబులెన్స్ వసతి, వినోద క్రీడా వ్యాయామ ప్రాంగణాలు, వనాలతో సముదాయాలు నిర్మించాలి. భవన ప్రాంగణాలు నిర్మించడంతో సరిపెడితే సరిపోదు, వాటి నిర్వహణకై సేవా నిబద్ధులైన నిర్వహణా సిబ్బందిని నియమించాలి. ఆర్ధికంగా వెసులబాటు లేని వృద్ధ జనులతోపాటు, ఆర్ధికవనరులుండీ ఆత్మీయత. ఆదరణ కరువైన వృద్ధులకు కూడా కొంత రుసుములతో వసతి సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత యిచ్చి తక్షణమే అత్యవసర ప్రాతిపదికన చేపట్టవలసిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉన్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అక్కడక్కడా అతితక్కువ సంఖ్యలోవున్న జైన, క్రిస్టియన్ , హిందూ బౌద్ధ మతాది సేవాసంస్థలు తమ ఆధ్వర్యంలో, వ్యాపారుల, ఇతర దాతల వితరణతో దేశంలో కొన్ని వృద్ధాశ్రమాలు నడుపుతున్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం నిర్దారించిన నిర్దిష్ట నియమ నిబంధనల పరిధిలోకి తెచ్చి వారి అనుభవాన్నివారి సహాయ సహకారాలను తీసుకుంటూ వృద్ధులకు మెరుగైనసేవలు అందించే దిశగా జాతీయసేవా వాహిని వినూత్నంగా నిర్మించుకొని మనదేశం ప్రపంచదేశాలకే ఆదర్శంగా నిలబడవచ్చు.
అంతేకాదు, ఉద్యోగాలు చేసుకొనే భార్యా భర్తలది ప్రత్యేక సమస్య.
1) ఇంట ఉన్నవయోవృద్ధుల సంరక్షణ,
2) వారి యొక్క పిల్లల సంరక్షణకు,
3) ఉద్యోగనిర్వహణ
4) సమయం వెచ్చింపు
వృద్ధాశ్రమాలు, బాల సేవాకేంద్రాలు ప్రభుత్వాలు నిర్వహించినపుడు ఉద్యోగులు, ఉద్యోగినులు తమ బాధ్యతలు నిబద్ధతతో నిశ్చింతగా నిర్వహించి అధికోత్పత్తి సాధించి దేశ ప్రయోజనాలకు తోడ్పడే అవకాశాలు మెండవుతాయి. ఇదే రీతిలో వీధిబాలలకు, అనాధలకు, సమాజంచే నిర్లక్ష్యించబడిన అన్నివర్గాల ప్రజలకు ఓ చక్కని ప్రాతిపదికను స్థిరీకరించి, ఆయా యువతకు విద్య, సాంకేతిక నైపుణ్యం అందిస్తూ, ఇతర ప్రజలలో శక్తియుక్తులను, ప్రతిభా సామర్ధ్యాలను కూడా వెలికితీసి దేశానికి కావలసిన వివిధరంగాలకు నిష్ణాతులైన మానవ వనరులను సమకూర్చ వచ్చు.
అట్టి రంగాలు
ఉదా:
వ్యవసాయం, కుటీరపరిశ్రమ, శాస్త్రీయరంగం, రక్షణరంగం, వినోదరంగం, ఉత్పాదకరంగ, పర్యాటకరంగం, వాణిజ్యరంగం,
ఆహార ఉత్పాదక రంగం, విద్యారంగం..
ఇలా కావలసిన రీతిలో సకల రంగాలలో వారికి సరైన శిక్షణనిచ్చి, వారందరి ప్రతిభను దేశ ప్రయోజనాలకై వినియోగించుకొనే దిశలో ఒక మహత్తర యోజనను ప్రారంభిస్తే, మానవవనరుల సంపూర్ణ వినియోగం దిశగానూ, సంపూర్ణ నిరక్షరాస్యత దిశగానూ దేశాన్ని పయనింపజేసి నిరుద్యోగరహిత భారతం సాకారమోతుందనడంలో సందేహం లేను. ఆ స్థితిలో దేశం సుభిక్షమవ్వడం నిర్వివాదాంశం.
ఈ ప్రక్రియను దిగ్విజయం చేయగలిగితే దేశవ్యాప్తంగా సామూహిక భోజనశాలలు స్థాపించే దిశగా ఎదిగి ఇంటిలో వంట చేసుకొనే అవసరమే లేని ఆహారవ్యవస్తను సమున్నతంగా నిర్మించుకొని, తద్వారా వ్యక్తి తన సంపదను పూర్తి విశ్వాసంతో జాతికి అంకితమిచ్చే స్థితికి జాతిని నిర్మించుకుందాం. ప్రపంచ దేశాల్లో సమున్నతంగా నిలబడదాం.
ప్రభుత్వాలను జాగృతపరిచే పనిలో సమకాలీనులందరూ ముఖ్యంగా యువత అత్యవసరంగా దృష్టి సారించి తమ వంతుగా ఆర్ధిక, మేధో సహకారం అందించి తమ నిమజ్ఞత, నిబద్ధత, చాటుకోవలసిన తరుణం ఇదే.. .
– జై భారత్.-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *