ఆలయ దర్శనం

దైవదర్శనానికి వెళ్లే సమయంలో మనం ధరించిన దుస్తులతో పాటు శరీరమూ, మనస్సూ కూడా పరిశుభ్రంగా, నిర్మలంగా ఉండేలా చూసుకోవాలి. నుదుటన చక్కగా విభూతి లేదా కుంకుమ ధరించాలి. అలాగే, ఆలయప్రవేశం చేసేముందు తప్పనిసరిగా కాళ్లూ, చేతులూ కడుక్కునే లోపలికి వెళ్లాలి.

మనతో ఎవరైనా వస్తుంటే వారితో గట్టిగా మాట్లాడు కుంటూ ఆలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయానికి వస్తున్నామంటే మన మనస్సంతా ఆ దైవంమీదనేలగ్నం చెయ్యాలి. మనసులో ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఆలయానికి వెళ్లాలి. లేదా ఏ దేవతను సందర్శించేందుకు వెడుతున్నామో ఆ దేవత నామాన్ని స్మరిస్తూ లోపలికి వెళ్లాలి.

ఆలయంలోకి ప్రవేశింపచేసే రాజగోపుర ద్వారాన్ని దర్శించి రెండుచేతులూ జోడించి స్వామి దర్శనం తనివి తీరా చేయించమని గోపురాన్ని వేడుకోవాలి. లోపలికి వెళ్లగానే ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఉండే నిలు వెత్తు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభమంటే నిజమైన భక్తునికి నిదర్శనం. ఎప్పుడూ స్వామి సన్నిధిలో నిశ్చలమైన ధ్యానముద్రలో ఉండే ఈ స్తంభానిదే అసలు పుణ్యమంతా. అందుకే చాలా పవిత్రంగా ఈ స్తంభానికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసుకుని నమస్కరించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసినా ఉత్తమ ఫలితం వస్తుంది.

అనంతరం బలిపీఠా (సాధారణంగా అమ్మవారి, శివాలయాల్లో ఇది ఉంటుంది)న్ని సందర్శించి మనలో పేరుకున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను బలి చేస్తున్నట్టు భావించి, వీటి స్థానంలో ప్రేమ, త్యాగం, దాతృత్వంఇత్యాది గుణాలను అలవడేలా చెయ్యమని ప్రార్థించుకోవాలి.

అనంతరం ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసుకుని అనంతరం ఆలయంలోని తొలిపూజల వేల్పు గణనాథుణ్నిదర్శించి మొక్కాలి. ఈ స్వామికి గుంజీళ్లంటే ఇష్టం. ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా’ అంటూ భక్తితో మూడునుంచీ అయిదుకు మించకుండా శక్తిమేరకు గుంజీళ్లు తీసి స్వామి అనుగ్రహాన్ని అర్థించాలి. భక్తితో నమస్కరిస్తే చాలు పరవశించి వరాలననుగ్రహిస్తాడీ కరి ముఖ వరదుడు.

అనంతరం ఆలయ ప్రధాన మూల విరాట్టును దర్శించే ముందు ఇంకా ఈ ఆలయంలో ఇతర దేవతా మూర్తులు కొలువై ఉంటే వారిని దర్శించుకోవాలి. ఉపాలయాల్లోని ఆ మూర్తులను దర్శినంచిన అనంతరం ప్రధాన మూర్తి దర్శనానికి రావాలి. వైష్ణ్వాలయమైతే ఈ స్వామి గర్భాలయానికి ఎదురుగా వుండే గరుడాళ్వారునూ, గర్భగుడి సింహ ద్వారానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకులనూ సేవించుకుని, స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించమని వారిని కోరుకుని స్వామివారి కంటే ముందుగా వారి దేవేరి అయిన అలమేలు మంగమ్మను, శివాలయంలోనైతే పార్వతీదేవిని దర్శించాలి. ఆ తరువాత ప్రశాంత చిత్తంతో ప్రధానమూలవిరాట్టు అనుగ్రహం కోసం ప్రార్థించుకుంటూ ఆయన్ను దర్శించాలి.

స్వామిని దర్శించే సమయంలో ఒక్క క్షణాన్ని వృథా పోనీయకుండా తనివితీరా దర్శించాలి. అంతేకానీ, కళ్లు మూసుకుని ప్రార్థించకూడదు. (అయితే, ఇక్కడో విషయం ఉంది. నిజమైన భక్తులకు ఆ భక్తిపారవశ్యంలో కళ్లు మూసుకున్నా కూడా ఆయనమూర్తి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి భక్తులకిది మినహాయింపే మరి!) స్వామిని ఆపాద మస్తకం దర్శించాలి. అంటే- ముందుగా పాదాలనే చూడాలి. ఆ చరణాలే మనకు శరణాన్ని ప్రసాదిస్తాయన్న మాట. తరువాత, అభయాన్ని ప్రసాదించే హస్తాలు, ఆపై, కరుణను చిలకరించే నేత్రాలు, చిరునవ్వు చిందించే వదనం, ఇలా స్వామిని తిలకించి పులకించాలి.

అమ్మవారినైతే ముందుగా దయను వర్షించే నేత్రాలను, సౌభాగ్యసిద్ధి కలిగించే మాంగల్యాన్ని, అభయాన్నందించే హస్తాలు, ఆపై ఆప్యాయతగా మనవద్దకు వచ్చే ఆ శ్రీ చరణాలనూ దర్శించాలి.కిందికి చూస్తూ, తల్లిని చూసే చిన్నపిల్లల్లా మనసంతా ఆమెనే నింపుకుంటూ దర్శించుకోవాలి.

తరువాత ఆలయంలో ఎక్కడైనా కాసేపు కూర్చుని ప్రశాంతంగా స్వామిని ప్రార్థించుకోవాలి. తరువాత, ద్వారపాలకులను మనసులోనే దర్శించుకుని, వారి అనుమతిని కోరుకుంటూ, బయలుదేరాలి.

తరువాత మళ్లీ ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసుకుని తిరిగి వెళ్లాలి.

శివాలయాల్లో మామూలుగా ధ్వజస్తంభం వద్దే నందీశ్వరుణ్ని ప్రతిష్ఠించి వుంటారు. ఇట్లాంటి చోట్ల నంది తోకను భక్తిశ్రద్ధలతో తాకి కళ్లకద్దుకోవాలి.

తరువాత నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి వంగి చూస్తూ, ఎదుట వున్న పరమేశ్వరుణ్ని దర్శించుకోవాలి. ఆ తరువాతే ఆలయప్రవేశం చేసి వినాయకుణ్ణి దర్శించుకోవాలి.

నందీశ్వరుడూ, ధ్వజస్తంభమూ లేని ఆలయాల్లో వినాయకుణ్ణి ముందుగా దర్శించుకుని, స్తుతించుకుంటూ ముందుకు పోవాలి.

శివాలయాల్లో చిట్టచివర దర్శించుకోవలసిన దైవం చండికేశ్వరుడు. ఆయన నిరంతరమూ ధ్యానంలో వుంటాడు.