దేవీభాగవత కథలు – 1

నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక  పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి  దేవీభాగవత పురాణం  చెప్పమని కోరాడు.  సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం  వినిపిస్తానని ఆదిశక్తిని గురించి ఇలా చెప్పాడు:

‘‘ఆమె మహాశక్తి.  ఆమె వేదవిద్య. అన్ని లోకాలూ ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి.   సృష్టి స్థితి లయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే.  ఆమె ప్రేరణద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు.  బ్రహ్మ విష్ణు నాభినుంచి పుట్టాడు; విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు; ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు; ఆ జలానికే ఆధారం మహాశక్తి; లోకమాత. అలాటి దేవికి సంబంధించినది దేవీభాగవతం.

’’ సూతుడివల్ల దేవీభాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల పక్షాన శౌనకుడు సూతుడితో, ‘‘ ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి, దాని నేమి ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదనీ, అక్కడ కలి ప్రవేశించదనీ చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిశం అనే పేరు వచ్చింది.  మేం ఇక్కడే ఉండి పోయాం.  తిరిగి కృతయుగం వచ్చేదాకా  ఇక్కడే ఉండి, కలిభయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు.

అందుచేత నువ్వుమాకు పుణ్యప్రదమైన దేవీభాగవత పురాణం వినిపించు,’’ అన్నాడు. తిరిగి సూతుడు ఇలా చెప్పాడు:‘‘వ్యాసమహాముని నాకు ఎలా చెప్పాడో అలా నేను మీకు దేవీభాగవతం చెబుతాను. ఇప్పటికి ఇరవై ఏడు ద్వాపరాలు గడిచి, ఇరవై ఎనిమిదో ద్వాపరం జరుగుతున్నది.  ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి, పురాణాలు రచించిన సాత్యవతే…యుడు అనే వ్యాసుడు (సత్యవతి కొడుకు) మా గురువుగారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవీభాగవతం చెప్పుతూంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను.

‘అల్లుడి వెంట తిను; కొడుకు వెంట చదువు’ అంటారుగద పెద్దలు.  ఈ దేవీభాగవతం విని శుకుడు తరించాడు.  నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలుపడటం సాధ్యంకాదు.’’
ఇది విని మునులు  సూతుణ్ణి ,‘‘శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు?  అతను అరణిలో పుట్టాడని గదా చెబుతారు?’’ అని అడిగారు.

అప్పుడు సూతుడు మునులకు శుకుడి జన్మవృత్తాంతం ఇలా చెప్పాడు:ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీతీరాన తపస్సు చేసుకుంటూ, పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటమూ, వాటి నోటికి ఆహారం అందించి, అవి తింటుంటే చూసి ఆనందించటమూ గమనించి, తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందోగదా అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్ళిచేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు. కొడుకులను కనవచ్చు. కొడుకులు ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు. అలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చెయ్యటానికి కాంచనాద్రికి వెళ్ళి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని  ఆలోచిస్తూండగా, ఆయన ఉన్నచోటికి నారదుడువచ్చాడు.

అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి, ‘‘స్వామీ, సమయానికి వచ్చావు.  నా కోరిక తీర్చటానికే వచ్చి ఉంటావు,’’ అన్నాడు.   ‘‘సర్వజ్ఞుడివి.  నీకు ఒకరి సహాయం అవసరమా?  ఏమయినా నీ కోరిక ఏమిటో చెప్పు,’’ అన్నాడు నారదుడు.   ‘‘కొడుకులేనివాడికి పరలోకం ఉండదుట.  ఏ దేవుణ్ణి ప్రార్థించితే నాకు కొడుకునిస్తాడు?  చెప్పు, నారదా?’’ అని వ్యాసుడు అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు: ‘‘ఒకానొకప్పుడు, నా తండ్రి  అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది.

ఆయన విష్ణు లోకానికి వెళ్లి, విష్ణువును చూసి, నువ్వే సర్వోత్తముడవనుకుంటున్నాను. నీకన్న గొప్పవాడుంటే చెప్పు,’’ అని అడిగాడు.  దానికి  విష్ణువు, ‘‘నువ్వు  సృష్టించేవాడివనీ, నేను పెంపొందించేవాడిననీ, శివుడు హరించే వాడనీ జనం అనుకుంటారు.  ఇది పొరపాటు.  తేజస్సుతోకూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు.  మనం సృష్టి స్థితిలయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సూ, నాకు సత్త్వమూ, శివుడికి తమస్సూ తోడ్పడుతున్నాయి.  లేని పక్షంలో మనం గవ్వ విలువ చేస్తామా?

నేను ఈ శేషతల్పంమీద పడుకున్నా, లక్ష్మివెంట ఆరామాలలో విహరిస్తున్నా, పొగరు పట్టిన రాక్షసులను చంపినా ఆ శక్తి దయవల్లనే గదా?  వెనక  నేను మదుకైటభులనే దానవులతో అయిదువేల ఏళ్లు పోరాడి, చివరకు జయం పొందింది శక్తి సహాయంతో కాదా?  నేను స్వతంత్రుడనని ఒక్కనాటికీ అనుకోకు. ఒకసారి వింటినారితో నా తల తెగిపోతే, నువ్వు దేవశిల్పిచేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు.  ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అ…య్యానుగదా. అందుచేత నేను శక్తికి అధీనుణ్ణే. శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను,’’ అన్నాడు.

ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో, ‘‘నువ్వు ఆదిశక్తిని వేడుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది,’’ అన్నాడు.‘‘వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశాడు,’’అని సూతుడు మునులకు చెప్పాడు. వెంటనే మునులు,‘‘విష్ణువు తల తెగటం ఎలా జరిగింది?  ఆ…యనకు గుర్రం తల ఎలా  అతికారు?  ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు,’’ అని సూతుణ్ణి అడిగారు. హయగ్రీవావతారం పూర్వం విష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధంచేసి, అలసిపోయి, ఎక్కుపెట్టి ఉన్న వింటిమొన మీద గడ్డం ఆనించి నిద్రపోసాగాడు.

ఆ సమయంలో దేవతలు యజ్ఞం తలపెట్టి, విష్ణువుకోసం వెతుక్కుంటూ వచ్చి, అతను నిద్రలో ఉండటం చూసి, ఏం చెయ్యాలో తోచని స్థితిలోపడ్డారు.  అప్పుడు శివుడు బ్రహ్మతో, ‘‘నువ్వు ఒక పురుగును తయారుచేసి, దానిచేత విష్ణువు వింటి నారిని కొరికింపజెయ్యి. నారితెగగానే వింటి మొన పైకి లేస్తుంది.  వెంటనే విష్ణువు నిద్రలేస్తాడు. యజ్ఞం సాగుతుంది,’’ అన్నాడు.బ్రహ్మ పురుగును సృష్టించి, విష్ణువు వింటి నారిని కొరకమన్నాడు.దానికా పురుగు, ‘‘మహాత్మా, ఎలా చేసేది ఈ పని?  మహాపాపం కాదా?

తల్లీ పిల్లలను విడదీయటమూ, భార్యాభర్తలకు ఎడబాటు చేయటమూ, నిద్రాభంగం కలిగించటమూ బ్రహ్మహత్యలాటి మహాపాపాలు.  ఈ పని నన్నుచేయమన్నారా?’’ అని అడిగింది.‘‘నువ్వేమీ విచారించకు. యజ్ఞంలో అగ్నికి ఆహుతి చెయ్యని పదార్థమంతా నీకిస్తాం,’’అని బ్రహ్మ  పురుగుతో అన్నాడు. పురుగు సంతోషించి వింటి నారిని కొరికింది.  అప్పుడు పెద్ద ధ్వని పుట్టింది.  భూమి అదిరింది.  వింటి కొన చప్పున పైకి తన్నటంతో విష్ణువు తల కాస్తా ఎగిరిపోయింది.  అది చూసి దేవతలు దిమ్మరపోయి, ఏంచెయ్యాలో తెలీక, ‘‘నువ్వే సర్వేశ్వరుడివిగదా, అన్ని లోకాలనూ భరించేవాడివిగదా!

నీ గతి ఇలా అయిం దేమిటి?  ఏ రాక్షసులూ చెయ్యలేని ఈ పని నీకెవరు చేశారు?  నువ్వు మాయకు కూడా అతీతుడివే.  మాయ నిన్ను ఇలా చేసి ఉండటం సాధ్యమా?’’ అని విలపించారు.దేవగురువైన బృహస్పతి వారితో,   ‘‘ఇలా ఏడుస్తూ కూచుంటే ఏమవుతుంది?  జరిగిన దానికి ఉపాయం ఏదన్నా చూడండి,’’ అన్నాడు.‘‘దేవతలంతా చూస్తూండగానే విష్ణువు తల తెగి, ఎగిరిపోయిందిగదా!  మన ప్రయత్నంవల్ల ఏమవుతుంది?  దైవబలంవల్లనే ఏమైనా జరగాలి,’’ అన్నాడు ఇంద్రుడు.అప్పుడు బ్రహ్మ,‘‘దేనికైనా జగదీశ్వరి అనుగ్రహం కావాలి.

ఆవిడే సృష్టి స్థితి లయ కారకురాలు. అందుచేత మీరంతా ఆ ఆదిశక్తిని ప్రార్థించండి,’’ అన్నాడు.దేవతలు ఆదిశక్తిని ప్రార్థనచేశారు.  వారిని కరుణించి దేవి ప్రత్యక్షమయింది.‘‘తల్లీ, ఈ విష్ణువుకు ఈ గతి ఎందుకు పట్టింది?  అతని తల ఏమయింది?’’ అని దేవతలు దేవిని అడిగారు. దేవి వారితో  ఇలా చెప్పింది:‘‘కారణం లేకుండా ఏదీ జరగదు.  ఒకనాడు విష్ణువు పడకటింట లక్ష్మిని చూసి నవ్వాడు.  అది చూసి లక్ష్మి కంగారుపడింది.  విష్ణువు తన ముఖం చూసి ఎందుకు నవ్వాడు?  తన ముఖం అంత అనాకారిగా ఉన్నదా?  తనకన్న అందగత్తెను ఎవతెనైనా చూశాడా?

ఇలా అనుకుని లక్ష్మి సవతిపోరును తలచుకుని క్షణకాలం విలవిలలాడింది. తన భర్త తల సముద్రంలో పడుగాక అని శపించింది.  ఆ శాపం తగిలి విష్ణువుకు ఈ గతి కలిగింది. ఇది  ఇలాఉండగా, హయగ్రీవుడనే రాక్షసుడు వెయ్యి సంవత్సరాలు నాకోసం తపస్సుచేశాడు.  నేను ప్రత్యక్షమై, వరం కోరుకోమంటే, ఎవ్వరిచేతా తనకు చావు రాకూడదని కోరాడు. పుట్టిన ప్రాణికి చావు తప్పదుగనక మరేదన్నా వరం కోరుకోమన్నాను.

అందుకు వాడు తాను హ…యగ్రీవుడు గనుక హయగ్రీవుడి చేతనే చచ్చేలాగ వరం కోరాడు. నేను అలా వరం ఇచ్చాను. వాడిప్పుడు లోకాలన్నిటినీ క్షోభింపజేస్తున్నాడు. మూడు లోకాలలోనూ వాణ్ణి చంపగలవాడు లేడు.  కనక మీరు ఒక గుర్రం తల తెచ్చి, విష్ణువు శరీరానికి తగిలించి హయగ్రీవుణ్ణి సృష్టించండి.  అలాచేస్తే ఈ విష్ణు హయగ్రీవుడు ఆ రాక్షస హయగ్రీవుణ్ణి చంపేస్తాడు.’’ఇలాచెప్పి ఆదిశక్తి అంతర్హితురాలు కాగానే, దేవతలు దేవశిల్పిని పిలిచి, గుర్రం తల తెచ్చి విష్ణువు శరీరానికి అతకమన్నారు.

దేవశిల్పి అలాగే చేశాడు.  విష్ణువు హయగ్రీవ రూపంలో అదే పేరుగల రాక్షసుణ్ణి  చంపి, లోకాలకు ఆనందం చేకూర్చాడు. మధుకైటభులు తరవాత మునులు సూతుణ్ణి మధు కైటభుల కథ చెప్పమని కోరారు.  అప్పుడు సూతుడు వారికా వృత్తాంతం ఇలా చెప్పాడు: పాలసముద్రంలో  శేషతల్పంమీద విష్ణువు నిద్రపోతున్న సమయంలో అతని చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొచ్చి, నీటిలో ఈతలు కొట్టుతూ, తమ పుట్టుకకు ఆధారం ఏమిటా అని ఆశ్చర్యపడ్డారు.  వారిలో కైటభుడు అనేవాడు మధువుతో, ‘‘మహాసముద్రానికీ, మనకూ ఏదో ఆధారం ఉండి ఉండాలి,’’ అన్నాడు.

వాడు అలా అనగానే ఆకాశంనుంచి ఒక మాట వినిపించింది.మధుకైటభులు ఆ మాట పట్టుకుని జపించసాగారు.  అంతలో ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టయింది.  రాక్షసులు దాన్ని చూసి, అది శక్తి తేజస్సే అని నిశ్చ యించి, తమకు వినిపించిన ధ్వనిని మంత్రంగా భావించి, వెేు్యళ్లు తపస్సు చేశారు.  ఆ తపస్సుకు మెచ్చుకుని దేవి వారిని వరం కోరుకోమన్నది.  వాళ్ళుస్వేచ్ఛా మరణం కోరారు.  ఆమె వారు కోరిన వరం ఇచ్చింది.
తరవాత వాళ్ళు జలంలోనే సంచరిస్తూ, ఒకచోట బ్రహ్మను చూసి, తమతో …యుద్ధానికి రమ్మని పిలిచారు.     ‘‘మాతో …యుద్ధంచెయ్యి, యుద్ధం చెయ్య లేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి, ఎక్కడికైనా వెళ్ళిపో,’’ అన్నారు వాళ్ళు బ్రహ్మతో.  బ్రహ్మ భయపడి, యోగసమాధిలో ఉన్న విష్ణువుతో, ‘‘మేలుకో, నాయనా!  ఇద్దరు రాక్షసులు నన్ను చంపుతామంటూ వచ్చారు.  నన్ను కాపాడు,’’ అని వేడుకున్నాడు. ఈ మాటకు విష్ణువు యోగనిద్ర నుంచి లేవలేదు.

అప్పుడు బ్రహ్మ ఆదిశక్తిని తన యోగనిద్రనే ప్రార్థనచేశాడు :‘‘తల్లీ, ఈ రాక్షసులనుంచి కాపాడటానికి విష్ణువును లేవగొట్టు, లేదా, నువ్వే నన్ను కాపాడు,’’ అన్నాడు బ్రహ్మ. వెంటనే యోగనిద్ర విష్ణువును విడిచి వెళ్శిపోయింది. విష్ణువు నిద్ర లేచేసరికి బ్రహ్మ పరమానందంచెందాడు.