ఐ.ఏ.ఎస్ అధికారి నిజాయితీకి బహుమతి: 44వ బదిలీ


అశోక్ ఖేమ్కా

అశోక్ ఖేమ్కా

సోనియా గాంధీ జామాత రాబర్ట్ వాద్రా పాల్పడిన అక్రమ భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించి వార్తలకెక్కిన హర్యానా కేడర్ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీ అయ్యాడు. వాద్రా భూ కుంభకోణం తుట్టె కదిలించినందుకు గత అక్టోబరు నెలలో బదిలీ అయిన ఖేమ్కా, విత్తనాభివృద్ధి సంస్ధ నుండి మళ్ళీ బదిలీ వేటు ఎదుర్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీకి కారణం చెప్పలేదు. విత్తనాభివృద్ధి సంస్ధ ఉద్యోగుల పోస్టింగులు, క్రమశిక్షణ చర్యలతో హర్యానా పాలకవర్గాలు కన్నెర్ర చేయడమే తాజా బదిలీకి కారణమని అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల అవినీతికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఆగ్రహంతో ఉన్న నేపధ్యంలో గత అక్టోబరు నెలలో అశోక్ ఖేమ్కా వార్తలకెక్కాడు. భారత దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీగా ప్రసిద్ధి చెందిన డి.ఎల్.ఎఫ్ కంపెనీ, రాబర్ట్ వాద్రాల మధ్య జరిగిన అక్రమ భూమి లావాదేవీలపై విచారణకు ఆదేశించడంతో ఆయనను విత్తనాభివృద్ధి సంస్ధకు బదిలీ చేస్తూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దానికి కారణం.

‘కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ లాండ్ రికార్డ్స్’ విభాగం  డైరెక్టర్ జనరల్ గాను, రిజిస్ట్రేషన్ విభాగం ఇనస్పెక్టర్ జనరల్ గాను విధులు నిర్వర్తిస్తున్న అశోక్ ఖేమ్కా డి.ఎల్.ఎఫ్, వాద్రాల భూ లావాదేవీలలో పలు అక్రమాలు జరిగాయని అక్టోబరు 2012లో గుర్తించాడు. వాద్రా కంపెనీకి అనుకూలంగా డి.ఎల్.ఎఫ్ చేసిన ల్యాండ్ మ్యుటేషన్ అక్రమం అని గుర్తించాడు. వాద్రా, డి.ఎల్.ఎఫ్ అక్రమ లావాదేవీలపై ఖేమ్కా దృష్టి సారించినట్లు పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. బదిలీ ఆదేశాలు అందేలోపుగానే  ఆయన ల్యాండ్ మ్యుటేషన్ ఆయన రద్దు చేయడమే కాక విచారణకు ఆదేశించాడు. దరిమిలా ఆయన అనేక బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొన్నాడు.

ఖేమ్కా ఆదేశించిన విచారణను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి మార్గాలు వెతికి విఫలం అయింది. దానితో అనుకూల అధికారులను ఎంచుకుని వారి చేత విచారణ జరిపించినట్లు పత్రికలు తెలిపాయి. నలుగురు హర్యానా డిప్యూటీ కమిషనర్లు విచారణ జరిపి రాబర్ట్ వాద్రా అక్రమాలకు పాల్పడలేదని క్లీన్ చిట్ ఇచ్చేశారు. వాద్రాకు అత్యంత కనిష్ట ధరలకు డి.ఎల్.ఎఫ్ తన భూములను కట్టబెట్టిందనడంలో వాస్తవం లేదని, ప్రభుత్వానికి కూడా నష్టం ఏమీ రాలేదని వారు తేల్చిచెప్పారు. ఆ విధంగా హర్యానాలో ఒక ముఖ్యమైన భూ కుంభకోణం వెలికి రాకుండా సమర్ధవంతంగా నిరోధించబడింది. దానితో పాటు నిజాయితికి, అవినీతికి ఫలితం ఏమిటో రెండు పార్శ్వాలు ఒకే కేసులో ప్రజల దృష్టికి వచ్చాయి.

విత్తనాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి ‘హర్యానా ఆర్కీవ్స్’ కార్యదర్శిగా అశోక్ ను బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఉత్తర్వులలో బదిలీకి కారణం చెప్పలేదు. అయితే పి.టి.ఐ ప్రకారం విత్తనాభివృద్ధి సంస్ధ ఉద్యోగుల పోస్టింగులు, క్రమ శిక్షణ చర్యల విషయంలో ఆయన తీసుకున్న చర్యలు ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం కలిగించాయి. దానితో 21 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో 47 సంవత్సరాల అశోక్ ఖేమ్కా 44 వ సారి బదిలీ అయ్యాడు.

ఆయన స్ధానంలో నియమితుడైన అధికారికి ఖేక్మా ఇంకా చార్జి అప్పగించలేదని ఎన్.డి.టి.వి తెలిపింది. తనకు రాత పూర్వకంగా ఇంకా బదిలీ ఉత్తర్వులు అందలేదని కనుక యధావిధిగా విధులు నిర్వర్తిస్తానని ఆయన తెలిపాడు. బదిలీ పైన ప్రస్తుతం వ్యాఖ్యానించదలుచుకోలేదని ఖేమ్కా చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది. భూ రిజిస్ట్రేషన్ విభాగం నుండి బదిలీ ఐన అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మొహమాటంగా కడిగిపారేసిన ఖేమ్కా మరో విడత కడిగివేతకు బహుశా సిద్ధంగా ఉండి ఉండవచ్చు!

2 thoughts on “ఐ.ఏ.ఎస్ అధికారి నిజాయితీకి బహుమతి: 44వ బదిలీ

  1. మన దేశం లో ప్రతి అయ్యేయెస్ అధికారీ ఒక ఖేమ్కా అయి ఉంటే , దేశం లో అవినీతి రూపు రేఖలు మారి పోయి ఉండేవే !

వ్యాఖ్యానించండి