ఆత్మీయ ‘ఉత్తరం’ ఇప్పుడెక్కడ?


పోస్టు కార్డు, ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్… ఒకప్పుడు భారత దేశ వ్యాపితంగా మనుషులను, మనసులను కలిపింది ఈ మూడే. నిత్యం లక్షలాది చేతి రాత ఉత్తరాలు రైళ్లల్లో, బస్సుల్లో తూనీగల్లా దూసుకు వెళ్ళేవి. వీధి వీధినా, సందు సందునా సైకిళ్లపై పడుతూ లేస్తూ పోయే పోస్ట్ మేన్ గారి ‘పోస్ట్’ అన్న కేకతో గడప గడపలో చురుకు పుట్టేది. ప్రయాణించేది రైళ్లలో, బస్సుల్లోనే అయినా ఉత్తరం రాశామన్న సంతృప్తి నుండి, ఉత్తరం రావాలన్న ఎదురు చూపుల వరకూ ఉత్తరాల చుట్టూ అల్లుకున్న అనేకానేక ఆశల ఊసులు పల్లెలనుండి పట్నాల వరకూ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ వాతావరణాన్ని చార్జి చేస్తూ ఉండేవి.

ఇపుడా ఉత్తరాలు లేవు. ఉత్తరాలు తెచ్చే ఆత్మీయ పలకరింపులు లేవు. పోస్టు కార్డులు గుర్తు చేసే బంధుత్వాలు లేవు. ఇన్ లాండ్ లెటర్లు మోసుకొచ్చే ఒంటరి సంభాషణలు లేవు. ఎన్వలప్ లు కప్పి తెచ్చే రహస్య కబుర్లూ లేవు. ఎం.ఒ లు తీసుకొచ్చే చెమట ఫలితం లేదు. చరిత్రనూ, చారిత్రక వ్యక్తులనూ శ్వాసించే నలు చదరపు స్టాంపు ముక్కలు అసలే లేవు.

ఉత్తరాలు మోసుకొచ్చే తండ్రి తిట్ల దీవెన, తల్లి హృదయ ఆతృత, బావ మరుదుల చెతుర్లు, అన్న దమ్ముల జాగ్రత్తలు, అక్క చెల్లెళ్ళ ఓదార్పులు, కొడుకు కూతుళ్ల కొత్త ముచ్చట్లు, బంధు మిత్రుల పలకరింపులు, మొగుళ్ళ హెచ్చరికలు, పెళ్ళాల వేడుకోళ్ళు, భార్య భర్తల సరస సరాగాలు, ప్రేమ పక్షుల వేడి నిట్టూర్పులు… అన్నీ లైక్, అన్ లైక్ లుగా, ‘వన్’ టు ‘ఫైవ్’ స్టార్ రేటింగ్ లుగా కురచబారాయి.

మౌస్ క్లిక్ ల స్పీడు యుగం ఇపుడు రాజ్యమేలుతోంది. ఈ మెయిళ్ల ఉదాసీనత మనుషులను కమ్మేసింది. ఫేస్ బుక్ కృత్రిమత్వం భావ సంబంధాలను రెడీ మేడ్ గా మార్చివేస్తోంది. సెల్ ఫోన్ల భరోసా మానవీయ సామీప్యతను పలుచన చేసింది. ఎస్.ఎం.ఎస్ ల దూకుడు కర స్పర్శల కరువు తెచ్చింది. బిట్లు, బైట్ల వేడికి స్పర్శోద్వేగ భావ సముద్రాలు ఆవిరైపోతున్నాయి. వెబ్ కామ్ ల ఉరవడి కంటి చూపు సెంటిమెంటును మసకబార్చింది.

కడుపారా నవ్వడానికి, కసి తీరా తిట్టడానికీ, వెవ్వెవ్వే అని వెక్కిరించడానికీ, కోపం తీరా అరవడానికీ, మనసు తీరా భావైక్యత పొందడానికి ఇప్పుడు స్మైలీలు సరిపోతాయి. హృదయంతో స్పర్శించడానికి కీ బోర్డు టక టక లే గతి. మనసు ఆర్ద్రతలు ప్రవహింపజేయడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ సిద్ధం.  

ఉరేయ్ బుజ్జిగా! అని పిలవడానికి ఇపుడు ఎస్.ఎం.ఎస్ చాలు. చంపుతానోరే! అని ఇష్టంగా తిట్టడానికి సమక్షం అవసరం లేదు. చాన్నాళ్ల ఎడబాటు సృష్టించే ఉద్వేగాల వియోగానికి తావు లేదు. వియోగ విరహాలకు, కలయికల ఉద్విగ్నతలకు చోటు లేదు.

ఆధునిక టెక్నాలజీ ఉక్కు పరిష్వంగంలో ఉత్తరం అదృశ్యమైపోయింది. ఉత్తరాలు పోతూ పోతూ ఇన్నాళ్లూ ఇష్టంగా మోసుకొచ్చిన ‘మానవీయ ఆత్మీయత’ ను కూడా పట్టుకెళ్లిపోయాయా అన్న అనుమానం మిగిల్చి పోయాయి. దుర్భిణీ పెట్టి వెతకవలసిన అర కొర ఉత్తరాల్లోనూ పొడి పొడి షార్ట్ కట్ సమాచారాలే మిగులుతున్నాయి.

అయితే ఈ మెయిళ్ళు వద్దా? సమాచార సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన సౌకర్యం చేదా? ఎస్.ఎం.ఎస్ ల సులువు దూరం చేసుకోవాలా? సెల్ ఫోన్ ల స్పీడు అవసరం లేదా?

కానే కాదు. అన్నీ కావాలి. పాతలోని అనుభవ సాంద్రత, అనుభవ సారం ల శాశ్వత్వాన్ని కాపాడుకోవాలి. కొత్తలోని సౌకర్యాన్ని జత చేర్చుకోవాలి. కానీ ‘పాత’ ను పూర్తిగా త్యజించి ‘కొత్త’ కే నీరాజనం పడితే, మానవ సమాజానికి దిశ ఉండదు. ఉత్తరాల ఆత్మీయతను కాపాడుకుంటూనే, సెల్ ఫోన్ల సౌకర్యాన్ని చేర్చుకోవాలి. ‘సెల్ ఫోన్ ఉందిగా’ అన్న భరోసాతో ఉత్తరం విస్తృతిని విస్మరించడాన్ని మానాలి.

ముఖ్యంగా, పాత కొత్తల మేలు కలయికతో ‘మనిషితనాన్ని’ స్ధిరపరుచుకోవాలి.

4 thoughts on “ఆత్మీయ ‘ఉత్తరం’ ఇప్పుడెక్కడ?

  1. నాకూ అదే అనిపిస్తుంటుంది. ఏసీ బస్సులో కూర్చుని వేలు పైకీ కిందికీ ఆడిస్తూ తక్షణ సమాచారాన్నీ కొత్త కొత్త వీడియోలని ఐఫోనులలో చూసేస్తున్నాం, అవసరమైన సమాధానపు మెయిళ్ళు వెనువెంటనే పంపించీగలుగుతున్నాం. అయినా, హృదయంలోని ‘ఆనందపు, ఆందోళన అంశాలు ‘ పరిశీలిస్తే ఈ సదుపాయాలు లేనప్పుడూ ఇంతే ఉన్నాయి, ఇప్పుడూ అంతే ఉన్నాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా ‘ఆహార నిద్రా భయ మైధున ‘ అన్నట్టుగా మౌలికమైన ఆనంద కారకాలు ఎన్ని యుగాలైనా స్థిరంగానే ఉంటాయి.

  2. చాలా బాగా రాశారు విశేఖర్ గారూ! నేను హాస్టల్ లో ఉన్నప్పుడు మా నాన్న గారు రాసిన ఉత్తరాలు నేను ఇప్పటికీ దాచుకున్నాను.
    చాలా బాగుంది.

  3. అవునా చందు గారూ, మా నాన్న గారితో నా ఉత్తరాల అనుభవం చాలా సుదీర్ఘమైనది. దాచుకోలేదు గానీ, ఆయన రాతలు ఇప్పటికీ వివిధ సందర్భాల్లో గుర్తుకు వస్తుంటాయి. దాచుకుంటే ‘కలెక్టెడ్ వర్క్స్’ లాగా పెద్ద పుస్తకమే అయిండేది. పదమూడేళ్ల వయసు నుండి పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా ఆయన ఉత్తరాల ప్రవాహం కొనసాగింది. హెడ్మాస్టర్ గా చేసి రిటైర్ అవడం వల్లనేమో ఇన్ లాండ్ లెటర్ ఎప్పుడూ ఖాళీ లేకుండా రాస్తుండేవారు. ఖాళీ సరిపోక అంచుల వెంట చిన్న అక్షరాల్లో ఇరికించడం తరచుగా జరిగేది. ఎక్కువ రాస్తాననుకుంటే ఎన్వలప్ రాసేవారు. డి.డి ల్లాంటివి పంపాల్సి వచ్చినా ఎన్వలపే వాడేవారు. డి.డి లకు కవరింగ్ లెటర్ షరా మామూలే. తన ఆలోచన సాగినంత పరిధి వరకూ ఎన్నో విషయాలు నాకు నేర్పడానికి ఉత్తరాల్లోనే ప్రయత్నించేవారు.

    ఫోన్ సంభాషణ కంటే (అవి ఎంత సేపు సాగినా) దానికంటే ఉత్తరంలో రిచ్ నెస్, చిక్కదనం ఉంటుంది. శాశ్వతత్వం కూడా ఉంటుంది. ఫోన్ సంభాషణలని మళ్లీ మళ్ళీ వెనక్కి వెళ్లి చూసుకోవడానికి ఉండదు, రికార్డు చేసుకుంటే తప్ప. ఉత్తరం అయితే ఎన్నిసార్లయినా తిప్పి తిప్పి చదువుకోవచ్చు. మాట్లాడేప్పుడు దొర్లే సొల్లు ఉత్తరాల్లో ఉండదు. జాగ్రత్తగా ఆచితూచి రాస్తుంటాము. అందువల్ల అవి విలువ పరంగా ఫోన్ సంభాషణ కంటే ఎక్కువ బరువు మోస్తుంటాయి. ఆ రీత్యా చూసినా ఉత్తరం ప్రాముఖ్యత తీసిపోనిది.

  4. విశేఖర్ గారూ,
    బామ్మను కౌగలించుకున్న ఆ “ఉత్తరమ్మ” లేదా “అక్షరమ్మ” ఎంత కమనీయంగా, హృద్యంగా ఉందో. గత రెండు రోజులుగా హైందవ విషనాగు చర్చా క్రమంలో పడి ఈ కథనంపై దృష్టి పెట్టలేదు.

    మా రెవెన్యూ గ్రామం మడితాడు నుండి ముప్పై ఏళ్ల క్రితం వెంకటయ్య అనే పోస్ట్‌మన్ కిలోమీటర్ దూరంలోని మా ఊరికి అపరాహ్నం వేళ ఏరు దాటి, చెమటలు కక్కుకుంటూ బొచ్చెడు ఉత్తరాలు పట్టుకుని వచ్చేవారు ఊరంతా పంచడానికి. ఒక్కో ఇంట్లో ఉత్తరం లేదా పుస్తకాలు అందించి మండువాలో వీచే చల్లగాలిలో కాస్సేపు కూర్చుని సేదతీరి మజ్జిగ లేదా ఏదైనా తినడానికి ఇస్తే తిని తర్వాత ‘వస్తానమ్మా జయమ్మా’ అంటూ మా అమ్మను పలకరించి వెళ్లేవాడాయన. ఆ దృశ్యం తలుచుకుంటే ఎంత బాగుంటుందో!.

    మానాన్న పుంగనూరులో కాలేజీలో చదువుతూ ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చేరి, 1953 ప్రాంతాల్లో సోవియట్ భూమి, సోవియట్ ల్యాండ్ పత్రికలకు సంవత్సరం చందా కడితే మద్రాసులోని సోవియట్ ల్యాండ్ కార్యాలయం వారు 1980ల మధ్య వరకు మా ఇంటికి క్రమం తప్పకుండా ఆ పత్రికలు పంపేవారు. ఆ అద్భుతమైన వర్ణచిత్రాల పత్రికను దాని వాసన చూస్తేనే మతిపోయేది మాకు అప్పట్లో. సోవియట్ భూమిలో ప్రతివారమో లేదా మూడో వారమో ఒక కథ వేసేవారు.

    కాస్త లోకజ్ఞానం వచ్చాక మద్రాసు సువార్తవాణి వారి చిరునామాను పత్రికల ప్రకటనల్లో చూసి ఉత్సాహపడి కార్డుముక్క రాస్తే వాళ్లు సంవత్సరాలపాటు బైబిల్, సువార్త పత్రికలు పంపారు. కొన్ని అర్థమయ్యేవి. కొన్నింటిలో భాష చూసి అలాగే పెట్టేసేవాళ్లం. కాని సిలోన్ రేడియోలో మాత్రం సువార్త గీతాలు, మీనాక్షి అక్కయ్య తెలుగు పాటల వ్యాఖ్యలు అద్భుతంగా వినేవాళ్లం.

    భారత దేశం నుంచి పనిమీద సోవియట్ రష్యా సందర్శించిన ఒక ప్రొఫెసర్ తన దుబాసీగా వ్యవహరిస్తున్న రష్యన్ యువతి సౌందర్యానికి చిత్తైపోయి ఆమెతో తన ప్రేమవాంఛను చెబితే ఆమె సున్నితంగా ఆయన దృష్టిని మార్చిన కథను 70ల చివర్లో సోవియట్ భూమిలో చదివాను నేను. ఇది ఉప్పల లక్ష్మణరావు గారు రాశారనుకుంటాను. కథ పేరు గుర్తు లేదు కాని అద్భుతమైన ఫీలింగ్ వచ్చేది చదివినప్పుడల్లా నాకు. ఆ సమయంలోనే గురజాడ వారు ఈ విషయంమీదే రాసిన ‘సంస్కర్త హృదయం’ కథ కూడా చదవటం తటస్థించి రెండింటికి పోలిక పెట్టి మరీ చదివేవాడిని.

    చందమామలు, బాలమిత్రలు, బొమ్మరిల్లులు ఇంకా ఎమెస్కో పాకెట్ బుక్‌లు, జ్యోతి, యువ విజయచిత్ర పత్రికలు రుబ్బేసిన తర్వాత ఇంకా ఆ నెల పూర్తి కాకుంటే ఇంట్లో ఉండే పాత సోవియట్ భూమి సంచికలను కూడా ఓ పని పట్టేవాళ్లం. యుఎస్ఎస్ఆర్ సుదీర్ఘ విదేశాంగ మంత్రి కొసిగిన్ సుదీర్ఘ వ్యాసాలను అర్థమైనా కాకపోయినా పైనుండి కింది దాకా చదివేవాళ్లం. అతడు మాట్లాడుతుంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యులందరూ ఒక కునుకు తీసి లేచేవారని అప్పట్లో పెద్ద జోకులు.

    పాతబడిపోయిన తర్వాత సోవియట్ ల్యాండ్, భూమి పత్రికలలోని మధ్యభాగంలో వచ్చే ఆ అద్భుత వర్ణ కాగితాలను ఊడదీసి పాఠ్య పుస్తకాలకు అట్టలు వేస్తే సంవత్సరం చెక్కు చెదిరేవి కావవి. ఎంత మందపాటి ఆయిల్ పేపర్‌తో అవి ఉండేవో.

    నాన్న తనకు వచ్చే ఉత్తరాలన్నీ ఒక తీగెకు చుట్టి తన మందుల గదిలో గోడకు తగిలించేవారు. ఇటీవల వరకూ వాటిని నేను పల్లెలో పాడుబడిపోయిన మా ఇంటిలో చూశాను నేను. యూనివర్శిటీ నుంచి నేను ఆయనకు రాసిన ఉత్తరాలు, తను నాకు పంపిన ఉత్తరాలు ఇరవైఏళ్ల తర్వాత చదువుతుంటే ఆనాటి మా ఇల్లు, మా జ్ఞాపకాలు పరువులెత్తేవి.

    మహానగరంలో వెబ్ మీడియాలో పనిచేసే కాలంలోకి వచ్చి పడ్డాక గత ఎనిమిదేళ్లుగా ఉత్తరం ముక్క రాసిన అనుభవం దూరమైపోయింది నాకు. ఫోన్లు లేదా ఇమెయిల్స్ ఇదే బతుకైపోయిన చోట ఇలాంటి అక్షరమ్మల కౌగిలింతలు కనిపిస్తే మనసెక్కడికో పోతుంది. కోల్పోయిన చిరజ్ఞాపికలు ముల్లులా గుచ్చుతాయి.

    చర్చల గొడవల మధ్యలోనే ఇలాంటి అపరూప జ్ఞాపకాల కథనాలు చూస్తే మనసు తేలికైపోతుంది. మీకు అభినందనలు.

వ్యాఖ్యానించండి